
తొలి రౌండ్‌లో అలవోక విజయం
మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అన్‌మోల్, తస్నీమ్
మకావు: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో లో హాంగ్ యీ–ఎన్జీ ఇంగ్ చెయోంగ్ (మలేసియా) జంటపై గెలిచి శుభారంభం చేసింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మహిళల డబుల్స్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీ కూడా ముందంజ వేసింది.
తొలి రౌండ్‌లో ప్రియ–శ్రుతి 21–15, 16–21, 21–17తో జి లింగ్ హువాంగ్–వాంగ్ జు మిన్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ అన్‌మోల్, తస్నీమ్ మీర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అన్‌మోల్ 21–11, 21–13తో ఫాతిమా (అజర్‌బైజాన్)పై, తస్నీమ్ 21–14, 13–21, 21–17తో టిడాప్రోన్ క్లీబైసన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా)తో తస్నీమ్; రెండో సీడ్ బుసానన్ (థాయ్‌లాండ్)తో అన్‌మోల్ తలపడతారు.
టాప్ సీడ్ గాయత్రి జంటకు షాక్
మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే ని్రష్కమించింది. లిన్ జియో మిన్–పెంగ్ యు వె (చైనీస్ తైపీ) జోడీతో జరిగిన మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా జంట 21–16, 20–22, 15–21తో ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అపూర్వ–సాక్షి (భారత్) 8–21, 11–21తో తియో మె జింగ్–గో పె కి (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో హరిహరన్–రూబన్ (భారత్) 21–15, 19–21, 14–21 తో టోరి ఐజవా–దైసుకె సానో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. డింకూ సింగ్–అమాన్ (భారత్) జోడీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 21–18, 21–17తో లా చెయుక్ హిమ్–యెంగ్ షింగ్ చోయ్ (హాంకాంగ్) జంటపై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది.
మెయిన్ ‘డ్రా’కు హేమనాగేంద్ర జోడీ
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తాండ్రంగి హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హేమనాగేంద్ర బాబు–ప్రియ జోడీ 21–17, 21–19తో జి వె హి–యాన్ ఫె చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది.
మళ్లీ టాప్–10లోకి సాత్విక్–చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ టాప్–10లోకి దూసుకొచ్చింది. గతవారం చైనా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా సాత్విక్ జంట మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 10వ ర్యాంక్‌కు చేరింది. గతేడాది థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అనంతరం ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్న భారత ద్వయం... ఈ సీజన్‌లో మూడు టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరింది.
చైనా ఓపెన్ కంటే ముందు సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లలో సైతం ఈ జోడీ సెమీస్ ఆడింది. పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 17వ ర్యాంక్‌కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఇటీవల పీవీ సింధుపై నెగ్గిన 17 ఏళ్ల ఉన్నతి హుడా కెరీర్ బెస్ట్ 31వ ర్యాంక్ దక్కించుకుంది. ఈ విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా సింధు 15వ స్థానంలో ఉంది. టాప్–100లో భారత్ నుంచి 16 మంది ఉండటం విశేషం. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రిæ–ట్రెసా జాలీ జంట 11వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.