
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ క్రికెట్ టీమ్‌కు ఓనరయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)ఎడిషన్‌తో అరంగేట్రం చేయనున్న న్యూఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ISPL కమీషనర్ సూరజ్ సమత్ ధృవీకరించాడు. ISPLలో సల్మాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు. ISPLలో సల్మాన్ భాగస్వామ్యం లీగ్ యొక్క కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నాడు.
ISPLలో ఇదివరకే పలువురు సినీ ప్రముఖులు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ (మాఝీ ముంబై), సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ (టైగర్స్ ఆఫ్ కోల్‌కతా), అక్షయ్ కుమార్ (శ్రీనగర్ కే వీర్), తమిళ నటుడు సూర్య (చెన్నై సింగమ్స్), హృతిక్ రోషన్ (బెంగళూరు స్ట్రైకర్స్), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్) సంబంధిత ఫ్రాంచైజీలకు ఓనర్లుగా ఉన్నారు.
ISPLకు శక్తివంతమైన కోర్ కమిటీ ఉంది. ఇందులో భారతరత్న సచిన్ టెండూల్కర్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యుడు మరియు క్యాబినెట్ మంత్రి ఆశిష్ షెలార్, మినల్ అమోల్ కాలే, సూరజ్ సమత్ సభ్యులుగా ఉన్నారు.
ISPL అనేది టెన్నిస్ బాల్‌తో జరిగే టీ10 టోర్నమెంట్. ఈ టోర్నీని 2024లో ప్రారంభించారు. దేశం నలుమూలల్లో ఉండే క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈ లీగ్ పుట్టింది. ఈ లీగ్ కోసం ఆటగాళ్లను ఐపీఎల్ వేలం తరహాలో ఎంపిక చేసుకుంటారు.
రెండు సీజన్లలోనే ఈ టోర్నీ విశేషమైన ప్రజాధరణ పొందింది. రానున్న సీజన్ కోసం ఇప్పటికే 42 లక్షల రిజిస్ట్రేషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ ఓనర్‌గా సల్మాన్ చేరిక రిజిస్ట్రేషన్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. త్వరలోనే అహ్మదాబాద్‌కు సంబంధించిన ఫ్రాంచైజీపై కూడా ప్రకటన రావచ్చని తెలుస్తుంది.
ISPL మొదటి సీజన్‌లో టైగర్స్ ఆఫ్ కోల్‌కతా ఛాంపియన్‌గా అవతరించింది. గత సీజన్‌లో అమితాబ్ బచ్చన్ ఫ్రాంచైజీ మాఝీ ముంబై విజేతగా నిలిచింది. గత సీజన్ రికార్డు స్థాయిలో 28 మిలియన్లకు పైబడిన టీవీ వ్యూయర్షిప్‌ను పొందింది. అరంగేట్రం ఎడిషన్‌తో పోలిస్తే ఇది 47 శాతం అధికం.
ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన అనంతరం సల్మాన్ ఖాన్ ఇలా స్పందించాడు. ISPL ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సాధికారత కల్పిస్తుంది. భారత దేశంలోని ప్రతి వీధిలో ప్రతిధ్వనించే హృదయ స్పందన క్రికెట్. ఆ శక్తి స్టేడియంకు చేరుకున్నప్పుడు ISPL వంటి లీగ్‌లు పుడతాయి.
క్రికెట్ పట్ల నేను ఎప్పుడూ మక్కువ కలిగి ఉంటాను. ఈ ప్రత్యేకమైన లీగ్ భారతదేశంలో అట్టడుగు స్థాయి క్రికెట్‌ను ప్రోత్సహించడమే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు విలువైన వేదికను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తుంది. కాబట్టి ISPLలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా, ISPLలో విజేతకు రూ. కోటి, రన్నరప్‌కు రూ. 50 లక్షలు బహుమతిగా ఇస్తారు.