
రెండో రౌండ్‌లోకి ప్రపంచ నంబర్‌వన్
తొలి మ్యాచ్‌లో ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన బెలారస్ స్టార్
ఎర్రమట్టి కోర్టులపై తన ఆధిపత్యం నిరూపించునే దిశగా బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా అడుగు వేసింది. తనకు
అంతగా కలిసిరాని ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా శుభారంభం చేసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఆమె తొలి మ్యాచ్‌లో దుమ్మురేపింది. రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవాతో జరిగిన పోరులో సబలెంకా కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి విజయాన్ని ఖరారు చేసుకుంది.
వరుసగా ఎనిమిదో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న సబలెంకా గత ఏడాది సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2 ఆస్ట్రేలియన్ ఓపెన్, 1 యూఎస్ ఓపెన్) సాధించిన సబలెంకా స్థాయికి తగ్గట్టు ఆడితే ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతం సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్స్‌లో ఒకరైన నంబర్‌వన్ సబలెంకా గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో సబలెంకా 6–1, 6–0తో ప్రపంచ 86వ ర్యాంకర్ కమిల్లా రఖిమోవా (రష్యా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక డబుల్ ఫాల్ట్ చేసింది.
తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. 30 విన్నర్స్ కొట్టిన సబలెంకా 17 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ఎనిమిదో సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా), 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 11వ సీడ్ డయానా ష్నైడర్ (రష్యా) కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్‌వెన్ జెంగ్ 6–4, 6–3తో పావ్లీచెంకోవా (రష్యా)పై, స్వితోలినా 6–1, 6–1తో జెనిప్ సోన్‌మెజ్ (తుర్కియే)పై, డయానా 7–6 (7/3), 6–2తో క్వాలిఫయర్ సొబోలియెవా (ఉక్రెయిన్)పై గెలిచారు.
ముసెట్టి ముందంజ
పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ ముసెట్టి (ఇటలీ), 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా), 15వ సీడ్ టియాఫో(అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ముసెట్టి 7–5, 6–2, 6–0తో హాన్‌్ఫమన్ (జర్మనీ)పై, టామీ పాల్ 6–7 (3/7), 6–2, 6–3, 6–1తో ఎల్మెర్ మోలెర్ (డెన్మార్క్)పై, టియాఫో 6–4, 7–5, 6–4తో సఫిలిన్ (రష్యా)పై విజయం సాధించారు.
నాదల్‌కు సన్మానం
రికార్డుస్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను 14 సార్లు గెలిచిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌కు ఆదివారం నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే హాజరై నాదల్‌తో ఫొటోలు దిగారు. గత ఏడాది ఆటకు గుడ్‌బై చెప్పిన నాదల్ తన కెరీర్‌లో మొత్తం 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.