చెలరేగిన మార్క్రమ్‌, మిల్లర్‌.. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా | Sakshi
Sakshi News home page

చెలరేగిన మార్క్రమ్‌, మిల్లర్‌.. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా

Published Sun, Sep 17 2023 7:24 PM

SA VS AUS 5th ODI: Markram, Miller Shines, South Africa Sets 316 Target For Australia - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. 

చెలరేగిన మార్క్రమ్‌, మిల్లర్‌..
తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్‌్‌ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్‌ చేసింది. 

ఆఖర్లో జన్సెన్‌, ఫెలుక్వాయో మెరుపులు..
ఇన్నింగ్స్‌ చివర్లో మార్కో జన్సెన్‌ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 పరుగుల మార్కును దాటింది. 
 
పర్వాలేదనిపించిన డికాక్‌, డస్సెన్‌..
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌, మిల్లర్‌, జన్సెన్‌, ఫెలుక్వాయోలతో పాటు డికాక్‌ (27), డస్సెన్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ బవుమా (0), గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో వీరవిహారం చేసిన క్లాసెన్‌ (6), గెరాల్డ్‌ కొయెట్జీ (0), కేశవ్‌ మహారాజ్‌ (0) నిరాశపరిచారు. 
 
క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా..
నాలుగో వన్డేలో తన బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకుని, వన్డేల్లో అత్యంత ఘోరమైన గణాంకాలు (10-0-113-0) నమోదు చసేలా చేసిన క్లాసెన్‌పై ఈ మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జంపా.. క్లాసెన్‌ను కేవలం 6 పరుగులకే క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. క్లాసెన్‌ వికెట్‌ తీశాడన్న మాట తప్పిస్తే.. జంపా ఈ మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు సీన్‌ అబాట్‌ (2/54), గ్రీన్‌ (1/59), నాథన్‌ ఇల్లిస్‌ (1/49), టిమ్‌ డేవిడ్‌ (1/20) వికెట్లు తీశారు. 

అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్‌ (10), ఇంగ్లిస్‌ (0) ఔట్‌ కాగా.. మిచెల్‌ మార్ష్‌ (46), లబూషేన్‌ (27) క్రీజ్‌లో ఉన్నారు. జన్సెన్‌కు 2 వికెట్లు పడ్డాయి. కాగా, 5 మ్యాచ్‌లో ఈ వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచి, సిరీస్‌లో సమంగా నిలిచాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement