
నేషన్స్ లీగ్ టైటిల్‌ను రెండోసారి సొంతం చేసుకున్న రొనాల్డో బృందం
ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌పై ‘షూటౌట్’లో గెలుపు
మ్యూనిక్: జగద్విఖ్యాత స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ జట్టును విజేతగా నిలిపాడు. ఆద్యంతం ఉత్కంఠను రేపిన ఫైనల్లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 5–3తో డిఫెండింగ్ స్పెయిన్‌పై విజయం సాధించి ఈ టో ర్నీలో రెండోసారి విజేతగా నిలిచింది. 2018–2019లో తొలిసారి జరిగిన నేషన్స్ లీగ్ టోర్నీలోనూ పోర్చుగల్ జట్టుకే టైటిల్ లభించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు పోర్చుగల్, స్పెయిన్ జట్లు 2–2 గోల్స్‌తో సమఉజ్జీగా నిలిచాయి. దీంతో ‘షూటౌట్’ అనివార్యమైంది.
ఇందులో పోర్చుగల్ గోల్ కీపర్ డీగో కోస్టా కీలకపాత్ర పోషించాడు. నాలుగో పెనాల్టీకి దిగిన స్పెయిన్ స్ట్రయికర్ అల్వారో మొరాటా కిక్‌ను డీగో కోస్టా సమర్థంగా అడ్డుకోవడంతోనే పోర్చుగల్‌కు విజయం ఖాయమైంది. దీంతో మైదానంలోని రొనాల్డో అభిమానులు విజయ సంబరాల్లో మునిగితేలారు. స్పెయిన్ తరఫున మొదటి ముగ్గురు విజయవంతంగా గోల్స్ చేయగా... మొరాటా ఒక్కడే విఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ టైమ్ మ్యాచ్ కూడా పోటాపోటీగా సాగింది.
మ్యాచ్ తొలి అర్ధభాగంలో మార్టిన్ జుబిమెండి 21వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఐదు నిమిషాల వ్యవధిలోనే న్యూనొ మెండెస్ (26వ నిమిషంలో) గోల్ కొట్టడంతో 1–1తో స్కోరు సమమైంది. తిరిగి తొలి అర్ధభాగం ముగిసే ఆఖరి నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఒయర్లబెల్ (45వ నిమిషంలో) గోల్ చేసి 2–1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ద్వితీయార్ధం మొదలయ్యాక పోర్చుగల్ ఈ స్కోరును సమం చేసేందుకు ఎంతగానో ప్రయత్నించినా... స్పెయిన్ రక్షణపంక్తి, గోల్ కీపర్ సమన్వయంతో ఒక్క షాట్ కూడా లక్ష్యాన్ని చేరలేదు.
ఎట్టకేలకు స్టార్ స్ట్రయికర్ రొనాల్డో 61వ నిమిషంలో చేసిన గోల్ వల్లే పోర్చుగల్ మ్యాచ్‌లో నిలిచింది. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అతని రికార్డు గోల్ స్కోరు 138కి చేరింది. అక్కడ 2–2తో సమమైన స్కోరు నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు కొనసాగింది. విజేతను తేల్చేందుకు షూటౌట్‌ను నిర్వహించగా స్పెయిన్ తరఫున మెరినో, బెయెనా, ఇస్కో సఫలమవగా, మొరాటా నిరాశపరిచాడు.
పోర్చుగల్ తరఫున రామొస్, విటిన్‌హా, ఫెర్నాండెజ్, మెండెస్, నివెస్ ఇలా ఐదుగురు గోల్స్ చేయడంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. విజయానంతరం 40 ఏళ్ల రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ‘క్లబ్‌ల తరఫున ఇదివరకు ఎన్నో టైటిల్స్ గెలిచాను. కానీ అవేవీ పోర్చుగల్ విజయానికి సాటిరావు. దేశానికి ట్రోఫీ అందించిన ఆనందం ఎప్పటికీ ప్రత్యేకం’అని ఉబికివచ్చే కంటనీరును అదుపు చేసుకుంటూ వ్యాఖ్యానించాడు.