T20 WC 2024: టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు: గంగూలీ | Rohit Should Captain In T20 World Cup And Virat Kohli Also Should Be There: Sourav Ganguly - Sakshi
Sakshi News home page

T20 WC: కోహ్లి ఓ అద్భుతం..; టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: గంగూలీ

Jan 8 2024 11:08 AM | Updated on Jan 8 2024 12:24 PM

Rohit Should Captain In T20 World Cup Kohli Also Should Be There: Ganguly - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియాకు రోహిత్‌ శర్మనే కెప్టెన్‌గా ఉండాలని భారత జట్టు మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అన్నాడు. రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లి కూడా ఐసీసీ టోర్నీలో ఆడితే భారత్‌ అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని బీసీసీఐ మాజీ బాస్‌ అభిప్రాయపడ్డాడు. 

కాగా టీ20 వరల్డ్‌కప్‌-2022 తర్వాత కేవలం వన్డేలు, టెస్టులకే పరిమితమైన రోహిత్‌ శర్మ, కోహ్లి.. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో టీ20 సందర్భంగా పునరాగమనం చేయనున్నారు. ఏడాది తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో బరిలోకి దిగనున్నారు.

రోహిత్‌ గైర్హాజరీలో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ గాయాల కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో విరాహిత్‌ ద్వయం రీఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది.

చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌.. రోహిత్‌- కోహ్లితో చర్చించి అంతర్జాతీయ టీ20లలో మళ్లీ బరిలోకి దిగేలా ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరు ప్రపంచకప్‌ ఈవెంట్లోనూ ఆడటం దాదాపుగా ఖాయమైనట్లే!!

ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తున్న వీరి ఫామ్‌ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్‌ రూపంలో పొట్టి ఫార్మాట్లో టచ్‌లోనే ఉన్నా.. టీమిండియా తరఫున స్థాయికి తగ్గట్లు రాణిస్తారా? వీరి రాక వల్ల యువ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉండాలి. విరాట్‌ కోహ్లి కూడా జట్టుతో పాటే ఉండాలి.  విరాట్‌ అత్యద్భుతమైన ఆటగాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. 

ఇక చాలా కాలం తర్వాత నేరుగా జట్టులోకి వస్తున్నారంటూ కోహ్లి- రోహిత్‌ల గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం సరికాదన్న గంగూలీ.. జట్టుకు ఇలాంటి అనుభవజ్ఞుల అవసరం ఉందని నొక్కివక్కాణించాడు.

కాగా అఫ్గన్‌తో సిరీస్‌ ద్వారా విరాహిత్‌ ద్వయం టీ20 జట్టుతో చేరనుండగా.. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్‌ కీపర్లుగా సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మలకు జట్టులో చోటిచ్చారు. 

అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్, ముకేశ్‌ కుమార్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement