
రిటైర్మెంట్ ప్రకటించిన భారత కెప్టెన్
వన్డేల్లో కొనసాగుతానని స్పష్టీకరణ
4 జనవరి, 2025: ‘బ్యాటింగ్‌లో పరుగులు సాధించలేకపోతున్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఈ మ్యాచ్‌లో ఆడరాదని నేనే నిర్ణయం తీసుకున్నా. నేను టెస్టుల నుంచి తప్పుకోవడం లేదు. ఇది నా రిటైర్మెంట్ ప్రకటనకాదు’... ఆ్రస్టేలియాతో సిడ్నీ టెస్టు సమయంలో రోహిత్ శర్మ చెప్పిన మాట ఇది.
7 మే, 2025: ‘నేను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. సాంప్రదాయ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఇకపై వన్డేల్లో మాత్రం కొనసాగుతాను’... టెస్టుల్లో తాను రిటైర్ అవుతున్నట్లు రోహిత్ ప్రకటన.
న్యూఢిల్లీ: దాదాపు నాలుగు నెలల క్రితం రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి తనంతట తాను తప్పుకున్నప్పుడే అంతా అతని కెరీర్ ముగిసిందని భావించారు. పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతను వచ్చే జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళతాడా లేదా అనే సందేహాలు అప్పుడే వినిపించాయి. అయితే క్రికెట్‌లో వేగంగా అంతా మారిపోతుందని, రాబోయే కొన్ని నెలల్లో తాను పరుగులు సాధిస్తానంటూ రిటైర్మెంట్ వార్తలను 38 ఏళ్ల రోహిత్ కొట్టిపారేశాడు. ఇటీవల ఇంగ్లండ్ టూర్ కోసం కుదించిన 30 మంది జాబితాలో అతని పేరు కూడా ఉందని తేలడంతో ఇంగ్లండ్‌కు వెళ్లడం ఖాయమనిపించింది.
అయితే ఇప్పుడు అతని రిటైర్మెంట్ ప్రకటన వచ్చిoది. మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో తన టెస్టు కెరీర్ గురించి ఉన్న సందేహాలపై స్పష్టత వచ్చేలా అతను నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది టి20 వరల్డ్ కప్‌లో సారథిగా భారత్‌ను విజేతగా నిలిపిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్ ఇప్పుడు టెస్టులకు దూరమయ్యాడు. ఇకపై తనకు బాగా కలిసొచ్చిన, ఇష్టమైన వన్డే ఫార్మాట్‌లో మాత్రం కొనసాగనున్నాడు.
కారణాలు స్పష్టం...
రోహిత్ శర్మపై నిర్ణయానికి సంబంధించి మంగళవారం సెలక్టర్లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టును గెలిపించడంతో రోహిత్‌కు నాయకుడిగా తిరుగు లేదు. అయితే వన్డే ఫామ్‌ను టెస్టులకు అన్వయించరాదని సెలక్టర్లు భావించారు. ముందుగా అతని కెప్టెన్సీపై చర్చ జరిగింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూస్తే మరొకరికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం మేలని అనుకున్నారు. కెపె్టన్‌గా కాదంటే బ్యాటర్ కోణంలో చూస్తే టెస్టుల్లో అతని ఫామ్ చాలా పేలవంగా ఉంది.
సిడ్నీ తరహాలోనే తుది జట్టులో స్థానం దక్కడం కూడా కష్టం. ఇలాంటప్పుడు విఫల బ్యాటర్‌ను కెప్టెన్ కాబట్టి తుది జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదని భావించిన సెలక్టర్లు రోహిత్‌కు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి రోహిత్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది.
2 టెస్టుల్లో కలిపి 42 రన్స్ చేసిన అతను... న్యూజిలాండ్‌పై 3 టెస్టుల్లో కలిపి కేవలం 91 పరుగులు చేయడమే కాకుండా చరిత్రలో తొలిసారి కివీస్ చేతిలో భారత్ 0–3తో సిరీస్ కోల్పోయింది. ఆపై ఆసీస్‌తో తొలి టెస్టు ఆడని రోహిత్ తర్వాతి 3 టెస్టుల్లో కలిపి 31 పరుగులే చేశాడు. పేలవ ఫామ్‌తో చివరి టెస్టు నుంచి తనే తప్పుకున్నాడు.
రోహిత్ టెస్టు కెరీర్ గణాంకాలు
ఆడిన టెస్టులు: 67 ఆడిన ఇన్నింగ్స్: 116
చేసిన పరుగులు: 4301 సగటు: 40.57
అత్యధిక స్కోరు: 212 సెంచరీలు: 12
అర్ధ సెంచరీలు: 18 ఫోర్లు: 473 సిక్స్‌లు: 88 పట్టిన క్యాచ్‌లు: 88 తీసిన వికెట్లు: 2
అప్పుడప్పుడు కొన్ని ‘హిట్స్’
వన్డేల్లో రోహిత్ శర్మ పేరిట అసాధారణ రికార్డులు ఉన్నాయి... టి20ల్లో రెండు వరల్డ్ కప్ విజయాల్లో భాగం... కెపె్టన్‌గా రెండు ఐసీసీ టోర్నీలు నెగ్గిన ఘనత... కానీ వీటితో పోలిస్తే అతని టెస్టు కెరీర్ అంత ఘనంగా కనిపించదు. అక్కడక్కడ కొన్ని గుర్తుంచుకునే ప్రదర్శనలు వచ్చినా ఈ ఫార్మాట్‌లో రోహిత్ ఎప్పుడూ తనదైన ముద్ర వేయలేకపోయాడు. సరిగ్గా చెప్పాలంటే అతని టెస్టు కెరీర్ ఎప్పుడూ నిలకడ లేకుండా పడుతూ లేస్తూనే సాగింది.
SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కలిపి 25 టెస్టులు ఆడినా ఒకే ఒక శతకం ఉండటం అతని కెరీర్‌లో ఒక వైఫల్యం. అయితే ఈ విషయంలో అతను ఎప్పుడూ నిరాశ చెందలేదు. తనకు తెలిసిన ఆటను, తనదైన శైలిలోనే ఆడుకుంటూ పోయాడు తప్ప కొత్తగా ‘అత్యుత్తమ టెస్టు క్రికెటర్’ అనిపించుకోవాలనే తాపత్రయం, పట్టుదలను కనబర్చలేదు. టెస్టుల్లో మిడిలార్డర్ బ్యాటర్‌గా, ఆపై ఓపెనర్‌గా రెండు పార్శా్వల్లో అతని కెరీర్ సాగింది.
ఘనారంభం...
2010లో నాగపూర్‌లో దక్షిణాఫ్రికా టెస్టు... వీవీఎస్ లక్ష్మణ్ గాయం నుంచి కోలుకోకపోవడంతో రోహిత్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు వామప్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడటంతో మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత మరో మూడున్నరేళ్ల పాటు టెస్టు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చిoది. 2013లో వెస్టిండీస్‌తో ఆడిన తొలి రెండు టెస్టుల్లో 177, 111 నాటౌట్ స్కోర్లతో తన రాకను ఘనంగా చాటాడు.
అయితే ఆ తర్వాత ఆటలో పదును లోపించడంతో వైఫల్యాలు ఎదురయ్యాయి. అప్పుడప్పుడు అనూహ్యంగా వచ్చిన అవకాశాలను కూడా వాడుకోలేకపోయాడు. తర్వాతి ఐదేళ్లలో 23 టెస్టులు ఆడితే ఒకే ఒక సెంచరీ సాధించాడు! బౌన్సీ పిచ్‌లపై అతని అవసరం ఉందంటూ సెలక్టర్లు ఆ్రస్టేలియాలో రెండు టెస్టులు ఆడించగా ఒక అర్ధసెంచరీ చేశాడు.
ఓపెనర్‌గా చెలరేగి...
వన్డేల్లో ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన రోహిత్ ను టెస్టుల్లోనూ ఓపెనర్‌గా ప్రయత్నించవచ్చని కోచ్ రవిశాస్త్రి చేసిన సూచన రోహిత్ కెరీర్‌ను మార్చింది. తన అమ్మ ఊరు విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 176, 127 పరుగులు చేసి కొత్త రోహిత్ పరిచయమయ్యాడు. అదే సిరీస్‌లో చేసిన 212 పరుగులు అతని కెరీర్‌లో ఏకైక డబుల్ సెంచరీ. ఓపెనర్‌గానే 43 టెస్టుల్లో 2697 పరుగులు సాధించిన అతను 9 శతకాలు నమోదు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు.
ఓవల్‌లో సత్తా చాటి...
చెన్నైలో స్పిన్‌తో గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై 161 (ఇంగ్లండ్‌పై) స్వదేశంలో అతని చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్. అయితే రోహిత్ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచిన ఇన్నింగ్స్‌లో 2021 ఓవల్ మైదానంలో వచ్చింది. ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం కోల్పోయిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతూ అతను చేసిన 127 పరుగులు జట్టును గెలిపించాయి. భారత్‌కు 24 టెస్టుల్లో రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించగా జట్టు 12 మ్యాచ్‌లు గెలిచి 9 ఓడింది. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చడం అతని నాయకత్వంలో అత్యుత్తమ ప్రదర్శన.
– సాక్షి క్రీడా విభాగం