
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ (Sanjay Bangar)విమర్శలు గుప్పించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అన్నాడు. వన్డే, టీ20 క్రికెట్‌లో సరైన షాట్ల ఎంపిక విషయంలో ఇప్పటికీ అతడు తడబడుతుండటం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు.
అత్యంత ఖరీదైన ఆటగాడిగా
ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు.
చెత్త ప్రదర్శన
అయితే, ఆట విషయంలో మాత్రం పంత్ తుస్సుమనిపించాడు. ఇప్పటి వరకు పది ఇన్నింగ్స్ 12.80 సగటుతో.. 99.22 స్ట్రైక్‌రేటుతో 128 పరుగులే చేశాడు. పంత్ ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన నాటి (2016) నుంచి అతడి కెరీర్‌లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పవచ్చు.
టెస్టుల్లో అద్బుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!
లక్నో కెప్టెన్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పంత్ విఫలం కావడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘వైట్ బాల్ క్రికెట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో పంత్ తడబడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
50, 20 ఓవర్ల ఫార్మాట్లో అతడి ఆట గొప్పగా లేదు. అయితే, టెస్టు క్రికెట్‌లో మాత్రం అతడొక అద్భుతమైన బ్యాటర్. సంప్రదాయ ఫార్మాట్లో అతడి ఆటకు పేరు పెట్టే పనేలేదు.
కానీ ఈ ఐపీఎల్ సీజన్లో అతడు అవుటైన విధానం చూస్తుంటే.. స్కూప్ షాట్లు ఆడేందుకు అతడు విఫలయత్నం చేసిన తీరును గమనించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.
వారం పాటు వాయిదా
అదే విధంగా.. రిషభ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్ సరిగా లేదని సంజయ్ బంగర్ ఈ సందర్భంగా విమర్శించాడు. తనలోని అత్యుత్తమ బ్యాటర్ ఆడే విధానాన్ని పంత్ మర్చిపోయాడని.. అందుకే ఇలా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2025లో పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఐదు గెలిచి.. ఆరింట ఓడింది. తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
టీమిండియా తరఫున ఇలా..
టెస్టుల్లో రిషభ్ పంత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటికి 43 మ్యాచ్‌లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.
అయితే, వన్డేల్లో 31 మ్యాచ్‌లలో కలిపి పంత్ కేవలం 871 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 76 అంతర్జాతీయ టీ20లలో కలిపి 1209 పరుగులు సాధించగలిగాడు. ఇక ఐపీఎల్‌లో మొత్తంగా 122 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 3412 రన్స్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!