
ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) దూరమైనట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు నాలుగో టెస్టుతో పాటు ఐదో మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ-2025 (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌తో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ ఇప్పటి వరకు రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాల సాయంతో ఏకంగా 462 పరుగులు సాధించాడు.
కాలికి గాయం
ఇక మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులోనూ రిషభ్ పంత్ రాణించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 48 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేశాడు.
అయితే, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు పంత్ ప్రయత్నించగా.. అతడి కుడికాలి పాదానికి దెబ్బ తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఆరు వారాల విశ్రాంతి
తాజా సమాచారం ప్రకారం.. పంత్ కుడికాలి బొటన వేలు ఫ్యాక్చర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గాయం తీవ్రత దృష్ట్యా అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మాంచెస్టర్ టెస్టుతో పాటు.. లండన్‌లో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టుకూ అతడు దూరం కానున్నాడు.
జట్టులోకి ఊహించని ప్లేయర్!
బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాయి. ‘‘పంత్ ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటాడు. అతడి స్థానంలో కవర్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
కాగా రిషభ్ పంత్‌తో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ప్రస్తుతం జట్టులో ఉన్నాడు. ఇటీవల లార్డ్స్ టెస్టు సందర్భంగా పంత్ వేలికి గాయమైనపుడు అతడు కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, తాజాగా పంత్ పూర్తిగా దూరం కావడంతో జురెల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్
ఇక ఇషాన్ కిషన్ ఇంత వరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. 2023లో సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వ్యక్తిగత కారణాలు చూపుతూ టూర్ మధ్యలోనే భారత్‌కు తిరిగి వచ్చాడు.
అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీల్లో ఆడేందుకు కూడా విముఖత చూపాడు. ఈ నేపథ్యంలో అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసిన బోర్డు.. ఇంతవరకు మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే, ఇషాన్ ఆ తర్వాత రంజీలతో పాటు దులిప్ ట్రోఫీ ఆడాడు. ఈ క్రమంలో, ఈ ఏడాది అతడి కాంట్రాక్టును పునరుద్ధరించారు. ఇక ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఇషాన్ మెరిశాడు.
చదవండి: అతడు ఫిట్‌గానే ఉన్నాడు కదా.. అన్షుల్‌ను ఎలా తీసుకున్నారు?