టీ20 ప్రపంచకప్-2026కు ముందు చివరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాలుగో టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. అయితే ఈ ఆఖరి మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.
అక్షర్ పటేల్ రీఎంట్రీ?
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో గాయపడిన భారత స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అక్షర్ ప్రస్తుతం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. . 4వ టీ20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. అక్షర్ కోలుకుంటున్నాడని, వరల్డ్ కప్‌నకు ముందు అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని పేర్కొన్నాడు. దీంతో తిరువనంతపురం టీ20కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
హార్దిక్‌కు విశ్రాంతి..
అదేవిధంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో పాండ్యా కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అతడి స్ధానంలోనే అక్షర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు నాలుగో టీ20కు దూరమైన ఇషాన్ కిషన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న హర్షిత్ రాణాపై వేటు పడే అవకాశం ఉంది. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి


