
గత ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల ధర దక్కించుకొని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ సారధి రిషబ్ పంత్ మరోసారి వేలం బరిలోకి దిగనున్నాడు. ఈసారి పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జులై 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగబోయే డీపీఎల్ వేలంలో పంత్ పేరు నమోదు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
పంత్ డీపీఎల్ ఆడేందుకు గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. పంత్ డీపీఎల్ ఎంట్రీ విషయాన్ని డీడీసీఏకు (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) చెందిన ఓ కీలక అధికారి బహిర్గతం చేశాడు. పంత్‌తో పాటు ఐపీఎల్ 2025 సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్), దిగ్వేశ్ రాఠీ (లక్నో సూపర్ జెయింట్స్) కూడా డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు.
ఈ ముగ్గురితో పాటు మరో ఏడుగురు ఐపీఎల్ స్టార్లు (ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మ, మయాంక్ యాదవ్, అనూజ్ రావత్) కూడా డీపీఎల్ 2025 వేలం బరిలో ఉండనున్నారు. ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ గత డీపీఎల్ సీజన్‌లో సంచలనాలు సృష్టించి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లోనూ ఇరగదీసి తమకు గుర్తింపునిచ్చిన డీపీఎల్ బరిలో మళ్లీ నిలువనున్నారు.
కొత్తగా రెండు ఫ్రాంచైజీలు
గతేడాదే పురుడుపోసుకున్న డీపీఎల్ రాబోయే ఎడిషన్‌లో మరో రెండు కొత్త జట్లను పరిచయం చేస్తుంది. తొలి ఎడిషన్‌లో (2024) ఆరు జట్లతో జరిగిన డీపీఎల్ ఈసారి ఎనిమిది జట్లతో సాగనుంది. కొత్త జట్ల వివరాలను డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇవాళ వెల్లండించారు.
ఇందులో ఓ జట్టు పేరు ఔటర్ ఢిల్లీ కాగా.. మరో జట్టు పేరు న్యూఢిల్లీ. ఔటర్ ఢిల్లీని సవిత పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.10.6 కోట్లకు కొనుగోలు చేయగా.. న్యూఢిల్లీ ఫ్రాంచైజీని భీమా టోలింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రేయాన్ అడ్వర్టైజ్‌మెంట్ సంస్థలు రూ.9.2 కోట్లకు దక్కించుకున్నాయి.
డీపీఎల్ తొలి ఎడిషన్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ దిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు పాల్గొన్నాయి. గత ఎడిషన్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్‌ను ఓడించి విజేతగా అవతరించింది.
గత సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఊహలకందని విధంగా 20 ఓవర్లలో 308 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఆ సీజన్‌లో ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో నమోదయ్యాయి. గత సీజన్‌లో ప్రియాంశ్ ఆర్య రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆయుశ్ బదోని ఓసారి శతక్కొట్టాడు. గత సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ మహిళల విభాగంలోనూ జరుగుతుంది.