మ్యాచ్‌ రిఫరీ అంటే ఆషామాషీ కాదు! | Retired referee David Boon comments | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ రిఫరీ అంటే ఆషామాషీ కాదు!

May 2 2025 3:46 AM | Updated on May 2 2025 3:46 AM

Retired referee David Boon comments

మాకూ క్లిష్టపరిస్థితులు ఎదురవుతాయి

బాల్‌ టాంపరింగ్, భద్రతా సవాళ్లను ఎదుర్కొన్నా

రిటైర్డ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ వ్యాఖ్య  

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించడం కుర్చీలో కూర్చున్నంత సులువు కాదని, సవాళ్లు ఎదుర్కొన్న సందర్భాలెన్నో ఉన్నాయని ఇటీవలే రిటైరైన మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో తన 14 ఏళ్ల కెరీర్‌లో బాల్‌ టాంపరింగ్, భద్రతా సవాళ్లు క్లిష్టమైనవని చెప్పుకొచ్చారు. ఆ్రస్టేలియాకు చెందిన మాజీ ఓపెనర్, 64 ఏళ్ల బూన్‌ పురుషుల క్రికెట్‌లో 87 టెస్టులు, 183 వన్డేలు, 112 టి20లకు... మహిళల క్రికెట్‌లో ఏడు టి20లకు మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించారు. 

అచ్చం క్రికెటర్లలాగానే కెరీర్‌కు టాటా చెప్పినా... కోచ్, మెంటార్‌లుగా ఆటతో అనుబంధాన్ని కొనసాగించినట్లే, ఈ వెటరన్‌ ఆస్ట్రేలియన్‌ కూడా రిఫరీగా రిటైర్మెంట్‌ ప్రకటించినా క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) డైరెక్టర్‌గా బంధాన్ని కొనసాగించనున్నారు. ‘రిఫరీ పనంటే అంతా సులువు కాదు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లు మాకు ఎదురవుతాయి. చాలా సార్లు బాల్‌ టాంపరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించడంలో పడిన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఢాకా (బంగ్లాదేశ్‌), క్రైస్ట్‌చర్చ్‌ (న్యూజిలాండ్‌) వేదికల్లో జరిగిన మ్యాచ్‌కు సరిగ్గా ఇలాంటి కఠిన పరిస్థితుల్నే ఎదర్కొన్నాను. కొన్ని చోట్ల భద్రతా సవాళ్లు తప్పలేదు. 

ఏదేమైనా... బిజీ క్రికెట్‌ పెరిగినా... జెంటిల్‌మెన్‌ క్రికెట్‌ స్థాయి పెంచేందుకే రిఫరీ నిర్ణయాలుంటాయి. 14 ఏళ్ల రిఫరీ కెరీర్‌లో సాఫల్యాలు చూసుకుంటే సంతోషంగా ఉంటుంది’ అని 396 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన బూన్‌ వివరించారు. జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆయన కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఆట ప్రతిష్టను పెంచుతూనే సుదీర్ఘ సేవలందించిన బూన్‌ను ఐసీసీ చైర్మన్‌ జై షా ప్రశంసిస్తూ ఆయన సేవల్ని కొనియాడారు. రిఫరీ కాకముందు క్రికెటర్‌గా బూన్‌ ఆ్రస్టేలియా తరఫున 107 టెస్టులు ఆడి 7422 పరుగులు, 181 వన్డేలు ఆడి 5964 పరుగులు సాధించారు.   

Advertisement
 
Advertisement
Advertisement