ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం​.. 11 మంది మృతి | RCB Victory Parade: Stampede At Bengaluru Chinnaswamy Stadium | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం​.. 11 మంది మృతి

Jun 4 2025 5:31 PM | Updated on Jun 5 2025 9:29 AM

RCB Victory Parade: Stampede At Bengaluru Chinnaswamy Stadium

బెంగళూరులో జరుగుతున్న ఆర్సీబీ విజయోత్సవ సంబురాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మృతి చెందినట్లు తెలుస్తుంది. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది.

స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం​ సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. జనాలను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని తెలుస్తుంది. 

స్టేడియం బయట విషాద ఛాయలు అలుముకున్నా లోపల ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం మాత్రం యధాతథంగా కొనసాగింది. ఆర్సీబీ ఆటగాళ్లంతా వేదికపై వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 ఏళ్ల తమ ఐపీఎల్‌ టైటిల్‌ కలను సాకారం చేసినందుకు గాను ఆర్సీబీ ఆటగాళ్లకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్‌ టాప్‌ బస్‌లో విక్టరీ పరేడ్‌ను ప్లాన్‌ చేసింది. అయితే ఈ సమస్యలను ముందే ఊహించి పోలీసులు విక్టరీ పరేడ్‌కు అనుమతి నిరాకరించారు. అయినా అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానులు ఈ స్థాయిలో తరలి రావడంతో పోలీసులు కంట్రోల్‌ చేయలేకపోయారు. లాఠీచార్జ్‌ చేయడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తుంది.  

RCB సంబరాల్లో విషాదం.. ఏడుగురు మృతి

కాగా, 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న (జూన్‌ 3) జరిగిన 2025 సీజన్‌ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 18 సీజన్ల ప్రస్థానంలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ నాలుగో ప్రయత్నంలో టైటిల్‌ కలను సాకారం చేసుకుంది. 

ఈ టైటిల్‌ కోసం ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కూడా 18 సీజన్లు వేచి చూడాల్సి వచ్చింది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్‌ ఎట్టకేలకు 18వ ఎడిషన్‌లో టైటిల్‌ కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి సీజన్‌కు ముందు ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్‌ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల కూడా 18వ ప్రయత్నంలో సాకారమైంది. 
 


 

Advertisement
 
Advertisement
Advertisement