ఆర్సీబీ దెబ్బకు సన్‌రైజర్స్‌ ‘బౌల్డ్‌’

RCB Beat SRH By 10 Runs In IPL Encounter - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దెబ్బకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌల్డ్‌ అయ్యింది. సాధారణ స్కోరును సైతం ఛేదించలేక ఎస్‌ఆర్‌హెచ్‌ చతికిలబడింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో బెయిర్‌ స్టో(61) ను బౌల్డ్‌ చేసిన చహల్‌.. ఆ తర్వాత బంతికి విజయ్‌ శంకర్‌(0) బౌల్డ్‌ చేశాడు. 16వ ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్లో చహల్‌ వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బెయిర్‌ స్టో నీట్‌గా ఆడుతున్న సమయంలో చహల్‌ ఇచ్చిన బ్రేక్‌తో ఆర్సీబీలో ఉత్సాహం వచ్చింది.  అదే సమయంలో సన్‌రైజర్స్‌ ఢీలా పడింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్‌ శంకర్‌ తొలి బంతికే వికెట్‌ ఇవ్వడం సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టింది. అంతకుముందు మనీష్‌ పాండే(34)ను సైతం చహల్‌ ఔట్‌ చేశాడు. చహల్‌ వేసిన స్లో బంతిని హిట్‌ చేయబోయి మనీష్‌ పాండే ఔటయ్యాడు.   ఇక ఐదో వికెట్‌గా ప్రియాం గార్గ్‌(12)ను శివం దూబే ఔట్‌ చేయడంతో ఆర్సీబీ 129 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాసేపటికి అభిషేక్‌ శర్మ(7) రనౌట్‌ కావడంతో రైజర్స్‌ తేరుకోలేకపోయింది.(చదవండి: ఖతర్నాక్‌ కుర్రాడు.. పడిక్కల్‌)

ఒత్తిడిలో చిత్తు..
ప్రియాం గార్గ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రషీద్‌ ఖాన్‌ ఊపుమీద కనిపించాడు. వచ్చీ రావడంతోనే దూబే బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టాడు. కానీ 17 ఓవర్‌లో పరుగు కోసం యత్నించే క్రమంలో రషీద్‌ ఖాన్‌-అభిషేక్‌ పిచ్‌ మధ్యలో ఢీకొనడంతో ఇద్దరూ కింద పడిపోయారు. దాంతో అప్పటికే కీపర్‌ వద్దకు చేరిన బంతితో అభిషేక్‌ రనౌట్‌ అయ్యాడు. ఫలితంగా రైజర్స్‌ శిబిరంలో ఒత్తిడి మొదలైంది. ఓవరాల్‌గా గెలిచే అవకాశం ఉ‍న్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ చేజార్చుకుంది. చహల్‌ మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ ఓటమిని శాసించాడు. అతనికి జతగా నవదీప్‌ సైనీ రెండు వికెట్లు సాధించాడు. 18 ఓవర్‌లో భువనేశ్వర్‌ కుమార్‌(0), రషీద్‌ ఖాన్‌(6)లను బౌల్డ్‌ చేశాడు. దూబే వేసిన 19 ఓవర్‌లో మిచెల్‌ మార్ష్‌(0) ఔట్‌ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.  చివరి వికెట్‌గా సందీప్‌ శర్మ(9) ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ ఇంకా రెండు బంతులు ఉండగానే ఓటమి పాలైంది. సన్‌రైజర్స్‌ 153 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఐదుగురు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు బౌల్డ్‌ కావడం గమనార్హం. వార్నర్‌(6) రెండో ఓవర్‌లోనే రనౌట్‌ కావడంతో సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ మూడు వికెట్లు సాధించగా, సైనీ, దూబేలు తలో రెండు వికెట్లు సాధించారు. స్టెయిన్‌కు వికెట్‌ దక్కింది.

అంతకుముందు ఆర్సీబీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో  ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది . ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కేరళ కుర్రాడు దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ఆరంభించారు. వీరిద్దరూ దాటిగా ఆడి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పడిక్కల్‌ దాటిగా బ్యాటింగ్‌ చేసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, ఫించ్‌ మాత్రం కాస్త  నెమ్మదిగా ఆడాడు. పడిక్కల్‌ 42 బంతుల్లో 8ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫించ్‌ దూకుడు పెంచే యత్నంలో అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. పడిక్కల్‌ను విజయ్‌శంకర్‌ బౌల్డ్‌ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఫించ్‌ కూడా ఔటయ్యాడు. కోహ్లి(14) నిరాశపరచాడు. ఏబీడీ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు.  నటదూబే(7) ఆట మరీ పేలవంగా సాగింది ఆర్సీబీ నిర్ణీత 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top