ఒకటో నంబర్‌ హెచ్చరిక...

Rajasthan Royals fielding coach Dishant Yagnik tests positive - Sakshi

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే వచ్చేసిన కరోనా

రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ దిశాంత్‌కు కోవిడ్‌–19 పాజిటివ్‌

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020 కోసం బీసీసీఐనుంచి ఫ్రాంచైజీల వరకు అంతా సిద్ధమైపోతున్నారు... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆగస్టు 20 నుంచి ఒక్కో జట్టు యూఏఈ వెళ్లేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయంలో నిర్వాహకులను ఇబ్బంది పెట్టే వార్త ఇది. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న దిశాంత్‌ యాజ్ఞిక్‌కు కరోనా వచ్చినట్లు తేలింది.

కోవిడ్‌–19 పరీక్షలో తనకు పాజిటివ్‌గా వచ్చినట్లు అతను ప్రకటించాడు. యూఏఈ బయల్దేరడానికి ముందు జట్టు సభ్యులందరినీ ఒకే చోట చేర్చే క్రమంలో తాము పరీక్షలు నిర్వహించామని, ఇందులో యాజ్ఞిక్‌ పాజిటివ్‌గా తేలినట్లు రాయల్స్‌ యాజమాన్యం వెల్లడించింది. అయితే గత పది రోజుల్లో అతనికి దగ్గరగా జట్టులోని ఏ ఆటగాడు వెళ్లలేదని కూడా ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.  

నెగెటివ్‌గా తేలితే...
ఐపీఎల్‌ ఆరంభానికి నెలకు పైగా సమయముంది కాబట్టి దిశాంత్‌ యాజ్ఞిక్‌కు కరోనా రావడం ప్రస్తుతానికి జట్టుపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే టీమ్‌ ప్రణాళికలు కచ్చితంగా దెబ్బ తింటాయి. క్వారంటీన్‌తో పాటు సన్నాహకాల కోసమే ఐపీఎల్‌ జట్లు దాదాపు నెల రోజులు ముందుగా యూఏఈ వెళుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఫీల్డింగ్‌ కోచ్‌ ఆలస్యంగా జట్టుతో చేరితే అది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పుడు దిశాంత్‌ 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ క్వారంటైన్‌లో గడపాల్సి ఉంది.

ఆ తర్వాత అతను భారత్‌లోనే రెండు సార్లు కోవిడ్‌–19 పరీక్షలకు హాజరు కావాలి. ఆ రెండు నెగెటివ్‌గా వస్తేనే యూఏఈ విమానమెక్కుతాడు. అక్కడికి చేరాక నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటీన్‌లో ఉండి మరో మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అప్పటి వరకు ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ సేవలు కోల్పోయినట్లే. ప్రతికూల పరిస్థితుల మధ్య ఐపీఎల్‌కు సన్నద్ధమైన బీసీసీఐ, ఫ్రాంచైజీలకు తాజా పరిణామం ఒక హెచ్చరికలాంటిదే.

ఇక్కడినుంచి బయల్దేరడానికి ముందునుంచి లీగ్‌ ముగిసే వరకు వారు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో ఈ ఉదంతం చూపించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫునే 2011–2014 మధ్య ఐపీఎల్‌ ఆడిన దిశాంత్‌ యాజ్ఞిక్‌ దేశవాళీ క్రికెట్‌లో రాజస్తాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే అతను రాబోయే సీజన్‌ కోసం పాండిచ్చేరి జట్టుకు కూడా ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top