
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగే హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. అశ్విన్ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న విషయాన్ని క్రికెట్ హాంగ్‌కాంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో అశ్విన్‌తో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు పాల్గొంటారు.
ఏడేళ్ల తర్వాత పునఃప్రారంభం
హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీ ఏడేళ్ల విరామం తర్వాత కిందటి ఏడాదే (2024) పునఃప్రారంభమైంది. ఈ ఎడిషన్‌ను మరింత రంజుగా మార్చే ఉద్దేశంతో నిర్వహకులు అశ్విన్ లాంటి స్టార్లను ఆహ్వానించారు. గతేడాది అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత, ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అశ్విన్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్ల లీగ్‌ల్లో పాల్గొంటానని ప్రకటించాడు. హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీతో అశ్విన్ కొత్త ప్రయాణం మొదలవుతుంది.
నిబంధనలు ఎలా ఉంటాయంటే..?
హాంగ్‌కాంగ్ సిక్సస్‌లో ప్రతి జట్టులో ఆరు మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ప్రతి ఆటగాడు ఒక్కో ఓవర్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటర్లు 50 పరుగుల తర్వాత రిటైర్ అయ్యేలా ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఈ టోర్నీకి గతంలో (టీ20లకు ముందు) చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే టీ20ల రాకతో ఈ ఫార్మాట్ మరుగున పడిపోయింది. ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇదిలా ఉంటే, అశ్విన్ గతేడాది చివర్లో (డిసెంబర్ 18, 2024) అంతర్జాతీయ క్రికెట్‌కు.. ఈ ఏడాది అగస్ట్ 27న ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్‌తో సంబంధాలన్నీ తెగిపోయాయి.
ఇకపై అతను ప్రపంచంలో ఎక్కడైనా, ఎలాంటి టోర్నీలో అయినా పాల్గొనవచ్చు. ఈ విషయంలో అతనికి బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. భారత క్రికెట్ సహా ఐపీఎల్‌తో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న ఏ భారత క్రికెట్ అయినా ప్రపంచంలో తనకు ఇష్టమైన చోట క్రికెట్ ఆడుకోవచ్చు.