
దేశీయ క్రికెట్‌లో రాణించినా జాతీయ జట్టులో దక్కని చోటు
క్రికెట్‌కు ప్రియాంక్ పంచల్ వీడ్కోలు
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్‌ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.
క్రికెట్ కెరీర్‌గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.
విషయం అర్థమైంది
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.
చాన్స్ రాలేదు
డొమెస్టిక్ సూపర్‌స్టార్‌గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్‌కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.
టైమ్ ముఖ్యం
తనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్‌లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్‌లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్‌లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్‌కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.
బాధగానే ఉంది.. కానీ
టీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.
చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?
'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు.