
బాకు (అజర్‌బైజాన్): రెడ్‌బుల్ డ్రైవర్, ఫార్ములావన్ మాజీ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ అజర్‌బైజాన్ సర్క్యూట్‌పై దూసుకెళ్లాడు. శనివారం జరిగిన రేసులో పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా 1 నిమిషం 41.117 సెకన్లలో ల్యాపును పూర్తిచేశాడు. ఈ సీజన్‌లో అతనికిది ఆరో పోల్ పొజిషన్ కాగా... ఏడుసార్లు చాంపియన్ అయిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (ఫెరారి)కు ఈ గ్రాండ్‌ప్రి కలిసిరాలేదు. అతను ఏకంగా 12వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.
శనివారం జరిగిన బాకు సిటీ సర్క్యూట్ అత్యంత క్లిష్టంగా సాగింది. ఏకంగా ఆరు మంది రేసర్ల కార్లు ప్రమాదానికి గురయ్యాయి. చాంపియన్‌షిప్‌లో లీడర్‌బోర్డులో ఉన్న మెక్‌లారెన్ రేసర్ ఆస్కార్ పియాస్ట్రి కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో ప్రధాన రేసుకు అతను దూరమయ్యాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ మొదటి స్థానం నుంచి ప్రారంభిస్తారు. బాకు సర్క్యూట్ రేసర్లను బాగా ఇబ్బంది పెట్టింది.
ప్రతికూల వాతావరణం కూడా డ్రైవర్ల కష్టాలను పెంచింది. అదేపనిగా వర్షం, రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుగురు రేసర్ల కార్లు ప్రమాదానికి గురవడం ఆందోళనకు గురిచేసింది. పియాస్ట్రీ సహా, ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్, ఒలీవర్ బియర్మన్ (హాస్), అలెక్స్ అల్బన్ (విలియమ్స్), హుల్కెన్‌బర్గ్ (సాబెర్), పియెర్ గాస్లీ (ఆల్‌పైన్స్) ప్రమాదాలతో ప్రధాన రేసుకు అర్హత సాధించలేకపోయారు.