త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్ మూడు లేదా నాలుగో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్ వేగంగా పురోగతి సాధిస్తే ప్రణాళికలు మారవచ్చని చెప్పుకొచ్చాడు.
కమిన్స్ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్‌కప్ తొలి రెండు మ్యాచ్‌లు సహా, దానికి ముందు పాకిస్తాన్‌లో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్‌తో సిరీస్‌కు కమిన్స్ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు.
ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకైనా కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్ ప్రపంచకప్ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్‌కు దూరమైనా, ఆ జట్టు టైటిల్ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్‌లో ఆసీస్ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో మొదలవుతుంది. ఆసీస్ రెండో మ్యాచ్ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్..ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్-బిలో ఉంది.
ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా


