టీ20 వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్‌తో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.
వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి, బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొన్నారు. మరో స్టార్ పేసర్ హరీస్ రౌఫ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ విభాగంలో అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్‌కు చోటు దక్కింది.
లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్ కోసం పాక్ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్ ఇది. చివరిగా ఆసీస్ 2022లో పాక్‌లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.
ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్ మొదలవుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్ గ్రూప్-ఏలో ఉంది.
ఈ గ్రూప్‌లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్


