చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్తాన్‌.. జింబాబ్వే కంటే హీనంగా..! | Pakistan Now Holds The Unwanted Record For Most International Defeats Since 2024, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్తాన్‌.. జింబాబ్వే కంటే హీనంగా..!

Jul 22 2025 2:57 PM | Updated on Jul 22 2025 3:31 PM

Pakistan Now Holds The Unwanted Record For Most International Defeats Since 2024

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్‌లోనూ సత్తా చాటలేకపోతుంది. సీనియర్ల ఫామ్‌ లేమి.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య సత్సంబంధాలు లేకపోవడం వంటి అనేక కారణాల చేత పాక్‌ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం పసికూనలపై కూడా ఆ జట్టు విజయాలు నమోదు చేయలేకపోతుంది.

తాజాగా వారి కంటే చాలా రెట్లు బలహీనమైన బంగ్లాదేశ్‌ వారికి షాకిచ్చింది. ఆదివారం (జులై 20) ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సంచలన విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాక్‌ ఓ ఘోర అప్రతిష్ఠను మూటగట్టుకుంది.

2024 నుంచి ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ చెత్త రికార్డును పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌ నుంచే లాగేసుకోవడం విశేషం. ప్రస్తుత క్రికెట్‌ పసికూనలుగా పిలువబడే జింబాబ్వే, వెస్టిండీస్‌ కూడా గతేడాది కాలంలో పాకిస్తాన్‌ కంటే మెరుగ్గా ఉన్నాయి.

2024 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) పాకిస్తాన్‌ 63 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఏకంగా 38 మ్యాచ్‌ల్లో ఓడింది. పాకిస్తాన్‌ తర్వాత అత్యధికంగా బంగ్లాదేశ్‌ 37 మ్యాచ్‌ల్లో (62లో) పరాజయాలు చవిచూసింది. 

వెస్టిండీస్‌ (65 మ్యాచ్‌ల్లో 35లో ఓటమి), జింబాబ్వే (61 మ్యాచ్‌ల్లో 31లో ఓటమి) లాంటి దేశాలు 2024 నుంచి పాకిస్తాన్‌ కంటే తక్కువ మ్యాచ్‌ల్లో ఓడాయి. ఈ గణాంకాలు చూస్తే పాక్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.

పాక్‌ను షాకిచ్చిన బంగ్లాదేశ్‌
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూల్చింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (4-0-6-2), తస్కిన్‌ అహ్మద్‌ (3.3-0-22-3) చెలరేగి బౌలింగ్‌ చేశారు. తంజిమ్‌ హసన్‌ సకీబ్‌ (4-0-20-1), మెహిది హసన్‌ (4-0-37-1) కూడా పర్వాలేదనిపించారు. 

పాక్‌ బ్యాటర్లలో ఫకర్‌ జమాన్‌ (44) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించగా.. ఆఖర్లో అబ్బాస్‌ అఫ్రిది (22), ఖుష్దిల్‌ షా (17) రెండంకెల స్కోర్లు చేయడంతో పాకిస్తాన్‌ అతి కష్టం మీద మూడంకెల స్కోర్‌ దాటగలిగింది.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయం సాధించింది (3 వికెట్లు కోల్పోయి). పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమోన్‌ (56 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీతో రాణించి బంగ్లాను గెలిపించాడు. అతనికి తౌహిద్‌ హృదోయ్‌ (36), జాకిర్‌ అలీ (15 నాటౌట్‌) సహకరించారు. 

పాక్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా 2, అబ్బాస్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఢాకా వేదికగానే ఇవాళ (జులై 22) సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement