అక్టోబర్ 14వ తేదీ అర్ధరాత్రి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ పరిధిలోకి ప్రవేశం
మొత్తం 23 మందిని అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్
భారత ప్రభుత్వం చర్చలు జరపడంతో ఎట్టకేలకు విడుదల
వీరిలో 9 మంది విజయనగరానికి చెందిన మత్స్యకారులు
మరో నాలుగైదు రోజుల్లో ఇక్కడకు వచ్చే అవకాశం
మహారాణిపేట: బంగ్లాదేశ్ చెరలో ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు మంగళవారం విడుదలయ్యారు. అక్టోబర్ 13న బయలు దేరిన మత్స్యకారులు 14న అర్ధరాత్రి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ పరిధిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ దేశ్ చెరలో ఉన్నారు. దీంతో భారత ప్రభుత్వం చర్చలు జరపడంతో మత్స్యకారుల విడుదలకు బంగ్లా దేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం బాగాహట్ జైలు నుంచి మత్స్యకారులను విడుదల చేశారు.
భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషన్ చంద్ర జీత్ దగ్గర ఉండి మత్స్యకారుల విడుదలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ను ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్‌తో కలిసి పూర్తి చేశారు. సమావేశం అనంతరం భారతీయ మత్స్యకారులను బాగాహట్ జైల్ నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు.
మోంగ్లా పోర్టుకు చేరుకున్న తర్వాత మోంగ్లా పోలీసుల కస్టడీలో ఉన్న బోట్ల వద్దకు మత్స్యకారులను తీసుకొని వచ్చి ఇండియాకు పంపడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులు సీజ్ చేసిన బోట్లను మరమ్మతులు చేస్తున్నారు. బుధవారం నాటికి బోట్ల రిపేర్లు పూర్తి చేసి మత్స్యకారులను వారి సొంత ప్రాంతాలకు పంపించనున్నారు.
కృతజ్ఞతలు తెలిపిన మత్స్యకారులు
మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నం చేసిన భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులకు మత్స్యకారుల తరఫున వైఎస్సార్‌సీపీ నేత వాసుపల్లి జానకీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. మోంగ్లా పోర్టుకు చేరుకున్న తర్వాత 9 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నాలుగు, ఐదు రోజుల్లో విశాఖపట్నం చేరుకుంటారని అంతవరకు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని జానకీరామ్ తెలియజేశారు.


