టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడంపై ఆనిశ్చితి కొనసాగుతుండగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జనవరి 25) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది ఆసియా కప్ జట్టులో లేని బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు తిరిగి రావడం పాకిస్తాన్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా కొనసాగుతుండగా.. పలువుర స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. హరీస్ రౌఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, హుస్సైన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హరీస్, సుఫియాన్ ముఖీమ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ తారిక్ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టు..
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (wk), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (wk), ఉస్మాన్ తారిక్
మా పని మేము చేశాం.. మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది..!
ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, పాక్ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రపంచకప్‌లో పాల్గొనబోమని పాక్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పీసీబీ, పాక్ జట్టు హెడ్ కోచ్ గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. “మేము సెలెక్టర్లం. మా పని జట్టును ఎంపిక చేయడం. పాల్గొనడం ప్రభుత్వ నిర్ణయం” అని సెలెక్టర్లు అన్నారు.
నెదర్లాండ్స్‌తో ఢీ
అన్నీ కుదిరితే పాక్ ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దీనికి ముందు పాక్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
ఇదిలా ఉంటే, భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.
అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది.
అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది.
"బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.
పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని పీసీబీ చీఫ్ నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
తదనంతర పరిణామాల్లో.. టీ20 వరల్డ్‌కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్‌కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.
నేపథ్యం
భారత్-బంగ్లాదేశ్ మధ్య పంచాయితీ (బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, తదనంతర పరిణామాల్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడం) నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకొని ఓవరాక్షన్ చేస్తుంది.


