రెండు వికెట్లతో దక్షిణాఫ్రికాపై విజయ
రాణించిన సల్మాన్, రిజ్వాన్
ఫైసలాబాద్: కొత్త వన్డే కెప్టెన్ షాహిన్ అఫ్రిది నేతృత్వంలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పాక్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (71 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డ్రి ప్రిటోరియస్ (60 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేయగా, కార్బిన్ బాష్ (41) రాణించాడు.
పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (71 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (74 బంతుల్లో 55; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేయగా...ఫఖర్ జమాన్ (45), సయీమ్ అయూబ్ (39) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా...రెండో వన్డే రేపు ఇదే మైదానంలో జరుగుతుంది.


