
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది.
ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సాహిబ్‌జాదా ఫర్హాన్ (63) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (33), మొహమ్మద్ నవాజ్ (27), సైమ్ అయూబ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నసుమ్ అహ్మద్ 2, షొరిఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా సిరీస్‌లో తొలి పరాజయం ఎదుర్కొంది. టెయిలెండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ అజేయమైన 35 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో సైఫుద్దీన్‌తో పాటు మొహమ్మద్ నైమ్ (10), మెహిది హసన్ మిరాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3, ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ నవాజ్ చెరో 2, అహ్మద్ దెనియాల్, సల్మాన్ అఘా, హుసేన్ తలాట్ తలో వికెట్ తీశారు.