పాక్‌ను దెబ్బేసిన సొంత దేశ మూలాలున్న ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌

PAK VS ENG 3rd Test Day 3: England Need 55 Runs To Win - Sakshi

PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు నెగ్గిన ఇంగ్లండ్‌.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్‌లోనూ విజయం సాధించి పాకిస్తాన్‌ను వారి స్వదేశంలో క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది.

మూడో రోజు ఆటలో పాకిస్తాన్‌ మూలాలు ఉన్న ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ ఆతిధ్య దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. రెహాన్‌ (5/48) ధాటికి పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. రెహాన్‌తో పాటు జాక్‌ లీచ్‌ (3/72), జో రూట్‌ (1/31), మార్క్‌ వుడ్‌ (1/25) రాణించడంతో పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే చాపచుట్టేసింది. పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (54), సౌద్‌ షకీల్‌ (53) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. 

ఛేదనలో ఎదురుదాడికి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్‌ క్రాలే (41), బెన్‌ డకెట్‌ (50 నాటౌట్‌) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం క్రాలేను అబ్రార్‌ అహ్మద్‌ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం నైట్‌ వాచ్‌మెన్‌గా వచ్చిన రెహాన్‌ అహ్మద్‌ (10)ను కూడా అబ్రార్‌ అహ్మదే ఔట్‌ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డకెట్‌కు జతగా స్టోక్స్‌ (10) క్రీజ్‌లో ఉన్నాడు. 

అంతకుముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ 354 పరుగులు చేసి 50 పరుగుల కీలక ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (78), అఘా సల్మాన్‌ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (111) సెంచరీతో, ఓలీ పోప్‌ (51), బెన్‌ ఫోక్స్‌ (64) అర్ధశతకాలతో రాణించారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో (తొలి ఇన్నింగ్స్‌) జాక్‌ లీచ్‌ 4, రెహాన్‌ అహ్మద్‌ 2, రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌, రూట్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. పాక్‌ బౌలర్లలో అబ్రార్‌ అహ్మద్‌, నౌమాన్‌ అలీ చెరో 4 వికెట్లు, మహ్మద్‌ వసీం ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top