
పురుషుల హండ్రెడ్ లీగ్ విజేతగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ అవతరించింది. నిన్న (ఆగస్ట్ 19) జరిగిన ఫైనల్లో ఆ జట్టు సథరన్ బ్రేవ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్.. నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
విల్ జాక్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ కర్రన్ 25, జోర్డన్ కాక్స్ 25, టామ్ కర్రన్ 24 పరుగులు చేశారు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో టైమాల్ మిల్స్, అకీల్ హొసేన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్ 2, క్రిస్ జోర్డన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ బ్రేవ్.. నిర్ణీత బంతుల్లో 130 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. అలెక్స్ డేవిడ్ 35, జేమ్స్ విన్స్ 24, క్రెయిగ్ ఓవర్టన్ 22 పరుగులతో సథరన్ బ్రేవ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో సకీబ్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా 2, నాథన్ సౌటర్, విల్ జాక్స్ తలో వికెట్ పడగొట్టారు.
హండ్రెడ్ లీగ్‌ను ఇన్విన్సిబుల్స్ గెలుచుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. ఈ లీగ్ తొలి ఎడిషన్‌ను సథరన్ బ్రేవ్ గెలవగా.. 2022 ఎడిషన్‌ను ట్రెంట్ రాకెట్స్ గెలుచుకుంది. మరోవైపు నిన్ననే జరిగిన మహిళల హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు వెల్ష్ ఫైర్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.