స్క్వాష్ కోహి‘నూర్‌’ | Nour El Sherbini eight time world squash championship | Sakshi
Sakshi News home page

స్క్వాష్ కోహి‘నూర్‌’

Jun 11 2025 1:04 AM | Updated on Jun 11 2025 1:04 AM

Nour El Sherbini eight time world squash championship

ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గిన నూర్‌ ఎల్‌ షెర్బిని

మరోసారి గెలిస్తే కొత్త చరిత్ర సృష్టించనున్న ఈజిప్ట్‌ స్టార్‌ ప్లేయర్‌

‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు... ఆరేళ్లకే రాకెట్‌ పట్టిన ఆ చిన్నారి పదేళ్లు తిరిగేసరికి వరల్డ్‌ టాప్‌–10లో చోటు దక్కించుకుంది. మరో నాలుగేళ్లకే ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ కైవసం చేసుకుంది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోని ఆ అమ్మాయి స్క్వాష్ లో రికార్డులు తిరగరాస్తూ ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకుంది. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఈజిప్ట్‌ దేశానికి చెందిన నూర్‌ ఎల్‌ షెర్బిని గురించే! అద్దాల గోడల్లోకి అడుగు పెడితే అదర గొట్టడమే పనిగా పెట్టుకున్న ఈ ‘వారియర్‌ ప్రిన్సెస్‌’ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే...   – సాక్షి క్రీడావిభాగం  

ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్‌ దేశం... మానవ నాగరికత మూలాలకు నిదర్శనం. ‘పిరమిడ్‌’లు, ‘మమ్మీ’లు ఇలా ప్రాచీన ఆనవాళ్లకు నెలవు. అలాంటి దేశం ఇప్పుడు స్క్వాష్ కు పెట్టింది పేరుగా మారింది. గత పదేళ్ల ఫలితాలు చూసుకుంటే పురుషుల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎనిమిది సార్లు ఈజిప్ట్‌ ఆటగాళ్లే టైటిల్‌ గెలిస్తే... మహిళల విభాగంలో అయితే పదికి పదిసార్లు ఈజిప్ట్‌ ప్లేయర్లే చాంపియన్‌గా నిలిచారు. 

అందులో పదిసార్లూ నూర్‌ ఎల్‌ షెర్బిని ఫైనల్‌ ఆడటం మరో విశేషం. ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఏ) ఆధ్వర్యంలో 2015లో కౌలాలంపూర్‌లో జరిగిన వరల్ట్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి విజేతగా నిలిచిన నూర్‌ 2016లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత వరుసగా 2017, 2018–19, 2019–20, 2020–21, 2022, 2023లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 

గతేడాది ఫైనల్లో ఈజిప్‌్టకే చెందిన నౌరన్‌ గోహర్‌ చేతిలో ఓడిన 29 ఏళ్ల నూర్‌ గత నెలలో చికాగో వేదికగా జరిగిన టోర్నీలో టైటిల్‌ హస్తగతం చేసుకొని ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. మహిళల విభాగంలో అత్యధిక సార్లు (8) ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ నెగ్గిన మలేసియా మాజీ స్క్వాష్‌ ప్లేయర్‌ నికోల్‌ డేవిడ్‌ సరసన చేరింది. మరోసారి విశ్వవిజేతగా నిలిస్తే నూర్‌ కొత్త చరిత్రను లిఖిస్తుంది.  

13 ఏళ్లకే ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌... 
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న నూర్‌... కుటుంబ నేపథ్యం ఆసక్తికరం. తండ్రి మంచి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కాగా... తల్లి అథ్లెట్‌. చిన్నప్పుడే స్క్వాష్ పై ఆసక్తి కనబర్చిన ఆమె సోదరుడి ప్రోత్సాహంతో ప్రొఫెషనల్‌గా మారింది. ఎనిమిదేళ్లు రాకముందే సీనియర్‌ ప్లేయర్లను కంగుతినిపించడం అలవాటు చేసుకున్న ఈ పొడగరి... నైపుణ్యాలు పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. 

13 ఏళ్లకే ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌గా అవతరించిన నూర్‌... ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కరాలిగా రికార్డు సృష్టించింది. పద్నాలుగేళ్ల వయసులోనే ప్రపంచ టాప్‌–50లో చోటు దక్కించుకున్న ఈ చిన్నది... 2016లో తన 19 ఏళ్ల వయసులో వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. 

ఏ క్రీడలో అయినా... ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఒక ఎత్తు అయితే దాన్ని కొనసాగించడం మరో ఎత్తు. నూర్‌ రెండో కోవకే చెందుతుంది. నిలకడకు మారుపేరైన ఈ ఈజిప్ట్‌ ప్లేయర్‌ విజయగర్వం తలకెక్కించుకోకుండా ఎప్పటికప్పుడు ఆటకు మెరుగులు దిద్దుకుంటూ అత్యుత్తమ ప్లేయర్‌గా పరిణతి సాధిస్తోంది. 

ఫెడరర్‌ స్ఫూర్తితో...  
పొరబాటున కూడా ప్రత్యర్థి ప్లేయర్‌ను పల్లెత్తు మాట అనని నూర్‌ తన ఆరాధ్య ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ బాటలోనే ముందుకు సాగుతోంది. నూర్‌కు స్క్వాష్‌తో పాటు టెన్నిస్‌ అంటే వల్లమాలిన ప్రేమ. అందులోనూ స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఆటకు వీరాభిమాని. ఆధునిక టెన్నిస్‌లో మేరునగ«దీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫెడరర్‌ను అమితంగా ఆరాధించే నూర్‌... కోర్టు బయట కూడా ఫెడరర్‌ వ్యవహార శైలిని అనుసరిస్తుంది. 

చిన్నప్పటి నుంచి స్క్వాష్‌ ఆడే అలవాటు ఉన్న ఫెడరర్‌... కొన్ని ప్రత్యేకమైన స్క్వాష్‌ స్ట్రోక్‌లను టెన్నిస్‌ కోర్టులో ప్రయోగించి ఫలితాలు రాబట్టాడు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు చేజిక్కించుకున్న ఫెడరర్‌ నడవడికను అనుకరించే నూర్‌ ... ఫెడరర్‌లాగే మృదుస్వభావి. ‘స్క్వాష్‌లో కాకుండా నేను ఆరాధించే ఏకైక ప్లేయర్‌ టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌.

అతడి నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతా. టెన్నిస్‌ కోర్టులో అతడు బ్యాక్‌ హ్యాండ్‌ స్ట్రోక్స్‌ కొడుతుంటే స్క్వాష్‌ ఆడినట్లే అనిపిస్తుంది. ప్రత్యర్థులతో అతడు తలపడే తీరు, వ్యవహరించే విధానం నాకెంతో ఇష్టం. జొకోవిచ్, నాదల్‌ వంటి వాళ్ల కంటే ఫెడరర్‌ శైలి భిన్నమైంది’ అని నూర్‌ పేర్కొంది. 

టీమ్‌ విభాగంలోనూ 5 స్వర్ణాలు 
32్ఠ21 ఫీట్ల అద్దాల గదిని రెండో ఇంటిలా భావించే నూర్‌... అటు సింగిల్స్‌తో పాటు ఇటు టీమ్‌ విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరుస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ సింగిల్స్‌లో 8 స్వర్ణాలు, 3 రజతాలు నెగ్గిన నూర్‌... టీమ్‌ విభాగంలో మరో 5 పసిడి పతకాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. అభిమానులంతా ముద్దుగా ‘ది వారియర్‌ ప్రిన్సెస్‌’ అని పిలుచుకునే షెర్బిని అందుకు తగ్గట్లే పోరాట యోధురాలుగా గుర్తుంపు తెచ్చుకుంది. 

ఎలాంటి స్థితిలోనూ సానుకూల దృక్పథాన్ని వీడకపోవడం... చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించకపోవడం... తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఆమెను ఇతర ప్లేయర్ల కంటే భిన్నంగా నిలిపింది. ‘నా ముద్దు పేరంటే ఇష్టం. నా ఆటతీరుకు అది సరిగ్గా నప్పుతుంది. కోర్టు బయట నేను పూర్తి భిన్నంగా ఉంటా. ప్రతి మ్యాచ్‌ను నా తొలి పోరుగానే భావిస్తా. 

ప్రపంచ చాంపియన్‌షిప్‌ అయినా మామూలు టోర్నమెంట్‌ అయినా సమానమైన ప్రాధాన్యతనిస్తా. ఒత్తిడిని దరిచేరనివ్వక పోవడమే నా ప్రధాన బలం. నాపై అంచనాలు పెంచేసుకొని వాటిని అందుకోవాలని తపన పడను. మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తా. దాని వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి’ అని నూర్‌ తెలిపింది.  

2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో స్క్వాష్ ను భాగం చేయడంతో ఈసారి ఈజిప్ట్‌ ప్లేయర్లు పతకాలు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తుంటే... వరుసగా పదేళ్లుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడిన నూర్‌ మాత్రం విశ్వక్రీడలకు చాలా దూరం ఉందని అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో అని వినమ్రతతో బదులిచ్చింది. 

‘ప్రతి ఒక్కరూ ఒలింపిక్స్‌ పతకాల గురించే ఆలోచిస్తున్నారు. అదంత సులభం కాదు. వచ్చే మూడేళ్లు ఎలా ఉంటుందో చెప్పలేం. విశ్వక్రీడల్లో పతకం నెగ్గడం ప్రతి ఒక్కరి కల. దాని కోసం ఇతర దేశాల ప్లేయర్లు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు’ అని నూర్‌ చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement