సూడాన్, ఈజిప్ట్ మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలోని బంగారు గనిపై వైమానిక దాడి జరిగి 72 మంది కార్మికులు మరణించారు. సూడాన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ ఎమర్జెన్సీ లాయర్స్ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. దాడి సమయంలో పర్వత ప్రాంతంలోని ఆ గనిలో వేలాది మంది పనిచేస్తున్నట్లు ప్రాణాలతో బయటపడిన వారు తెలిపారు.
ఈ దాడికి ఈజిప్ట్ వైమానిక దళం కారణమని ఎమర్జెన్సీ లాయర్స్ ఆరోపించింది. అయితే, ఈ సమాచారాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఈజిప్ట్ ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించలేదు. జబల్ అల్ ఉఖైదాత్ ప్రాంతంలోని బంగారు గనిపై ఈ ఏడాది జరిగిన రెండో వైమానిక దాడి ఇది. జూన్‌లో ఇదే ప్రాంతంలోని అనధికారిక బంగారు గనిపై జరిగిన దాడిలో 23 మంది కార్మికులు మరణించారు.
అప్పట్లో ఈజిప్ట్ సైన్యం తమ భూభాగంలో అక్రమ బంగారు తవ్వకాలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. అయితే, ఆ దాడికి తామే బాధ్యులమని సైన్యం నేరుగా ప్రకటించలేదు. తాజా దాడిలో 72 మంది పౌర గని కార్మికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందిందని, మృతుల సంఖ్యను నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోందని ఎమర్జెన్సీ లాయర్స్ తెలిపింది. ఈ దాడి సూడాన్ భూభాగంలో జరిగిందని ఆ సంస్థ పేర్కొంది.
ఐదుసార్లు దాడి
గని కార్మికుడు అబ్దెలజీజ్ యూసుఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 8 గంటలకు ఆ ప్రాంతంపైకి ఒక యుద్ధవిమానం వచ్చింది. అది ఐదుసార్లు దాడి చేయడంతో అనేక మంది మరణించారని ఆయన చెప్పారు. మరోసారి దాడి జరుగుతుందనే భయంతో తాము పర్వతంపైకి పరిగెత్తినట్లు వివరించారు.
మరో బాధితుడు షరఫ్ అలీ మాట్లాడుతూ.. దాడి జరిగిన సమయంలో మారుమూల ప్రాంతంలోని గనిలో వేలాది మంది పనిచేస్తున్నారని తెలిపారు. దాడి తర్వాత కొందరు అల్ అన్సారీ మార్కెట్ వైపు, మరికొందరు మరో దిశగా పరుగెత్తారని చెప్పారు. అందువల్ల ఎంతమంది మరణించారో కచ్చితంగా తెలియడం లేదన్నారు.
పారిపోతున్న సమయంలో నేలపై మృతదేహాలను చూశామని, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని బాధితులు తెలిపారు. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్గత సంఘర్షణ ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ప్రాణాలను బలిగొన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ యుద్ధం తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసింది. ఉపాధి కోసం పలువురు ప్రమాదకరమైన బంగారు తవ్వకాల రంగంలోకి వెళ్తున్నారు.
ఈ రంగం ద్వారా లభించే వనరులు యుద్ధంలో పాల్గొంటున్న ఇరుపక్షాలకు ఉపయోగపడుతున్నాయి. సూడాన్, ఈజిప్ట్ మధ్య సహజ వనరులు సమృద్ధిగా ఉన్న హలాయెబ్ త్రిభుజ ప్రాంతంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇరు దేశాలూ ఆ ప్రాంతంపై హక్కులు ప్రకటిస్తున్నాయి. సూడాన్ సైన్యానికి ఈజిప్ట్ మద్దతు ఇస్తున్నప్పటికీ, సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధాన్ని తన భద్రతకు ముప్పుగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో దాడిపై ఈజిప్ట్ ప్రభుత్వం స్పందిస్తుందా, మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అనే అంశాలు కీలకంగా మారాయి.


