సూడాన్‌లో అంతర్గత యుద్ధం మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రులే దాడులకు లక్ష్యంగా మారుతున్నాయి. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) సాయుధ బలగాలు వైద్య వ్యవస్థను దెబ్బతీసినట్లు ఆధారాలు లభించాయని బీబీసీ వెల్లడించింది. 2024 మే నుంచి 2025 అక్టోబర్ వరకు ఆస్పత్రులు, వైద్య కేంద్రాలపై కనీసం 43 వేర్వేరు దాడులు జరిగినట్లు గుర్తించింది. ఈ ఘర్షణల్లో 55 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరో 120 మంది గాయపడ్డారు. 10 మందిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడం లేదా అపహరించినట్లు పరిశోధనలో తేలింది.
ఎల్-ఫాషర్‌లోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన సౌత్ హాస్పిటల్‌పై 2024 మే చివరి వారం, జూన్ ప్రారంభంలో పలుమార్లు బాంబు దాడులు జరిగాయి. జూన్ 8న ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు ఆస్పత్రిలోకి చొరబడటంతో వైద్య సిబ్బంది ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆస్పత్రి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఇజ్జెల్డిన్ అహ్మద్ దావూద్ అసోవ్.. తాను చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆస్పత్రిలో రోగుల మృతదేహాలు, శస్త్రచికిత్స పరికరాలు ధ్వంసమైనట్లు తెలిపారు.
సౌత్ హాస్పిటల్ మూతపడటంతో అక్కడి వైద్య సిబ్బంది, మిగిలిన పరికరాలను సౌదీ మెటర్నిటీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అక్కడ కూడా దాడులు ఆగలేదు. ఒకే రోజులో 25 సార్ల వరకు బాంబు, డ్రోన్ దాడులు జరిగిన సందర్భాలున్నాయని ఆరుగురు వైద్యులు బీబీసీకి వివరించారు. పిల్లల ఆస్పత్రులు, డయాలసిస్ కేంద్రాలు, చిన్న వైద్య కేంద్రాలపైనా దాడులు జరిగినట్లు పరిశోధనలో గుర్తించారు. కొన్ని కేంద్రాలను ఇతర ప్రాంతాలకు తరలించినప్పటికీ అక్కడా దాడులు తప్పలేదు.
2025 అక్టోబర్‌లో ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు ఎల్-ఫాషర్‌ను స్వాధీనం చేసుకునే సమయానికి సౌదీ హాస్పిటల్ మాత్రమే పనిచేస్తున్న వైద్య కేంద్రంగా మిగిలింది. అదే నెల 25న ఆస్పత్రిలోకి బలగాలు చొరబడిన సమయంలో 460 మందికి పైగా రోగులు, వారి సహాయకులు హత్యకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను ఆర్‌ఎస్‌ఎఫ్ ఖండించింది.
మరోవైపు, ఆస్పత్రులను సైనిక స్థావరాలుగా ఉపయోగించారని ఆర్‌ఎస్‌ఎఫ్ మద్దతుతో పనిచేస్తున్న ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ఆరోపించారు. అయితే, ఈ వాదనలను స్వతంత్రంగా నిర్ధారించే ఆధారాలు తమకు లభించలేదని బీబీసీ స్పష్టం చేసింది. ఆస్పత్రులపై దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన కావచ్చని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఎల్-ఫాషర్‌లో జరిగిన ఘటనలు సూడాన్‌లో యుద్ధం వైద్య సేవలపై చూపుతున్న తీవ్ర ప్రభావానికి నిదర్శనమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. నిరంతర ఘర్షణల కారణంగా వైద్య సేవలు అందక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులపై దాడులు, వైద్య సిబ్బందిపై హింస నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు, వైద్య సేవల కొనసాగింపునకు ముప్పు పొంచి ఉంది.
ఇదీ చదవండి: ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి!


