తూచ్‌.. అంతా అబద్ధం: కోహ్లి విషయంలో డివిలియర్స్‌ యూటర్న్‌ | Sakshi
Sakshi News home page

Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్‌

Published Fri, Feb 9 2024 10:31 AM

'Not True, I Made A Mistake': AB de Villiers On Virat And Anushka Expecting 2nd Child - Sakshi

AB de Villiers Apology For Spreading False Information: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ మాట మార్చాడు. విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల గురించి తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానంటూ బాంబు పేల్చాడు. కోహ్లి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. వ్యక్తిగత కారణాలు చూపుతూ తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి కుటుంబ సభ్యుల గురించి వదంతులు వ్యాపించాయి.

సోషల్‌ మీడియాలో వదంతులు
అతడి భార్య అనుష్క గర్భవతి అని.. అందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యానే అతడు ఆటకు దూరమయ్యాడని మరికొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, తమ తల్లి సరోజ్‌ ఆరోగ్యంగానే ఉందని కోహ్లి సోదరుడు వికాస్‌ స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల తన యూట్యూబ్‌ చానెల్‌లో డివిలియర్స్‌ మాట్లాడుతున్న సందర్భంలో కోహ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘కోహ్లి బాగానే ఉన్నాడు. కోహ్లి దంపతుల రెండో బిడ్డ త్వరలోనే ఈ ప్రపంచంలోకి రానుంది’’ అని ఏబీడీ తెలిపాడు. దీంతో కోహ్లి- అనుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది.

అంతా అబద్ధం.. నేనన్న మాటల్లో నిజం లేదు
ఏబీ డివిలియర్స్‌ ఈ వార్తను ధ్రువీకరించాడంటూ పలు వార్తా సంస్థలు కూడా ప్రముఖంగా కథనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీ డివిలియర్స్‌  యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం.  

ఈ మేరకు జాతీయ మీడియా దైనిక్‌ భాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్‌ కంటే కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం. నిజానికి నా యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ ఆరోజు నేను ఓ పెద్ద తప్పు చేశాను. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు.

మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలి
విరాట్‌ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా అతడు బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నా.

ఆట నుంచి తను ఎందుకు విరామం తీసుకున్నాడో తెలియదు. అయితే, మరింత రెట్టించిన ఉత్సాహంతో.. సరికొత్తగా కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని ఏబీ డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు.

కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టుకు కోహ్లి తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ఈ మ్యాచ్‌ మొదలుకానుంది.

చదవండి: మహా క్రీడా సంబరం: విశాఖలో ఫైనల్‌ మ్యాచ్‌లు.. పూర్తి వివరాలు! ముగింపు వేడుకలు ఆరోజే

Advertisement
Advertisement