ఇదేం టెస్టు మ్యాచ్‌ కాదు: రోహిత్‌పై మండిపడ్డ కపిల్‌ దేవ్‌ | 'This Is Not A Test Match': Kapil Dev Slams Rohit Sharma Over Bumrah Role | Sakshi
Sakshi News home page

ఇదేం టెస్టు మ్యాచ్‌ కాదు: రోహిత్‌ శర్మపై మండిపడ్డ కపిల్‌ దేవ్‌

Published Wed, Jun 12 2024 3:50 PM | Last Updated on Wed, Jun 12 2024 4:14 PM

'This Is Not A Test Match': Kapil Dev Slams Rohit Sharma Over Bumrah Role

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మేనేజ్‌మెంట్‌ తీరుపై భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ మండిపడ్డాడు. టీ20 మ్యాచ్‌లలో టెస్టు మ్యాచ్‌ మాదిరి వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు.  

వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌, టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సేవలను ఎలా వాడుకోవాలో తెలియదా అంటూ కపిల్‌ దేవ్‌ ఫైర్‌ అయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది.

రెండు మ్యాచ్‌లలో తొలుత అతడి చేతికే బంతి
గ్రూప్‌-ఏలో భాగమైన రోహిత్‌ సేన తొలుత ఐర్లాండ్‌, ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలుపొంది టాపర్‌గా కొనసాగుతోంది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలో టీమిండియా బౌలింగ్‌ అటాక్‌ను యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆరంభించాడు.

రెండో ఓవర్లో మరో ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఇ​క ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరో ఓవర్‌లో బుమ్రాను బరిలోకి దింపిన హిట్‌మ్యాన్‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మూడో ఓవర్‌ సందర్భంగా బాల్‌ అతడికి ఇచ్చాడు.

అద్భుత స్పెల్‌తో దుమ్ములేపిన బుమ్రా
ఈ రెండు లో స్కోరింగ్‌ మ్యాచ్‌లలోనూ జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుత స్పెల్‌తో ఆకట్టుకుని భారత్‌కు విజయాలు అందించాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్ల కోటాలో కేవలం ఆరు పరుగులిచ్చి.. రెండు వికెట్లు తీశాడు బుమ్రా.

ఇక పాక్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. రెండుసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.  

అయితే, పేస్‌ దళ నాయకుడైన బుమ్రాను కాదని.. యంగ్‌స్టర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌తో బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించడం ఏమిటని ఇప్పటికే మాజీ సారథి సునిల్‌ గావస్కర్‌ ప్రశ్నించగా.. తాజాగా మరో దిగ్గజం, మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇవేమీ టెస్టు మ్యాచ్‌లు కాదు
‘‘అతడు వికెట్లు తీయగల సత్తా ఉన్నవాడు. అందుకే మొదటి ఓవర్లోనే బంతిని అతడికి ఇవ్వాలి. ఇవేమీ టెస్టు మ్యాచ్‌లు కాదు కదా! టీ20 ఫార్మాట్‌ ఇది.

ఎంత త్వరగా వికెట్లు తీస్తే.. అంత త్వరగా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయవచ్చు. ఒకవేళ బుమ్రా గనుక బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించి.. ఆదిలోనే రెండు వికెట్లు తీసినట్లయితే.. మిగతా బౌలర్లు కూడా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు’’ అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నాడు.

తప్పని నిరూపించాడు
అదే విధంగా.. ‘‘అతడి శరీరం.. ముఖ్యంగా భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పెడతాడు కాబట్టి బుమ్రా ఎక్కువ రోజులు క్రికెట్‌లో కొనసాగలేడని మనమంతా భావించాం.

అయితే, అందరి ఆలోచనలు తప్పని అతడు అనతికాలంలోనే నిరూపించాడు’’ అంటూ బుమ్రాను కొనియాడాడు కపిల్‌ దేవ్‌. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా బుధవారం నాటి మ్యాచ్‌లో న్యూయార్క్‌ వేదికగా అమెరికాతో తలపడనుంది.

చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement