BGT 2023: గిల్‌, కోహ్లి, అశ్విన్‌ కాదు.. ఆసీస్‌ ఆ టీమిండియా ఆటగాడి పేరు చెబితే వణికిపోతుంది..!

Not Ashwin, Kuldeep,Jadeja.. Australia Looking At Axar Patel As Biggest Threat During BGT - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు ఓ టీమిండియా ఆటగాడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడట. ఆ ఆటగాడు భీకరఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్లో లేక రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లినో లేక స్టార్‌ వెటరన్‌ స్పిన్నర్‌ అశ్వినో లేర సిరాజ్‌ మియానో అనుకుంటే పొరపాటు. పటిష్టమైన ఆసీస్‌ను అంతలా వణికిస్తున్న ఆ ఆటగాడు ఎవరంటే..?

ఇటీవలే పెళ్లి చేసుకున్న స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌. ఈ విషయాన్ని ప్రముఖ ఆసీస్‌ పత్రిక మార్నింగ్ హెరాల్డ్ ఓ నివేదికలో పేర్కొంది. భారత పిచ్‌లపై ఘనమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్న అక్షర్‌ పేరు వింటే ఆసీస్‌ బ్యాటర్లకు చెమటలు పడుతున్నాయట. ఇందుకు కారణం అతను ఇటీవలికాలంలో స్వదేశంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన తీరు. అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లను గతంలోనే పలు మార్లు ఎదుర్కొన్న ఆసీస్‌ బ్యాటర్లకు వీరి బౌలింగ్‌పై ఓ అవగాహణ ఉంది.

అయితే అక్షర్‌ను ఇంత వరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎదుర్కొని ఆసీస్‌ బ్యాటర్లు.. ఇతని నుంచే తమకు ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే స్పిన్‌ ట్రాక్‌లపై కఠోర సాధనతో పాటు అక్షర్‌ పటేల్‌ గతంలో బౌలింగ్‌ చేసిన వీడియోలు తెప్పించుకుని మరీ వీక్షిస్తున్నాట. స్పిన్‌ను అనుకూలించే ఉపఖండపు పిచ్‌లపై అక్షర్‌ ప్రదర్శన చూసి తాము భయపడుతున్నది నిజమేనని వారంగీకరించినట్లు సమాచారం.

అసలే సుదీర్ఘకాలంగా భారత్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలవలేదన్న అపవాదు మోస్తున్న ఆ జట్టుకు తాజాగా అక్షర్‌ భయం పట్టుకుందట. 2021 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌ భారత్‌లో పర్యటించినప్పుడు అక్షర్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 27 వికెట్లు పడగొట్టి ఆ జట్టుకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఈ సిరీస్‌కు సంబంధించిన వీడియోలను ఆసీస్‌ బ్యాటర్లు అధికంగా చూస్తున్నారట.

కాగా, ఇంగ్లండ్‌ సిరీస్‌ ద్వారానే టెస్ట్‌ అరంగేట్రం చేసిన అక్షర్‌..ఇప్పటివరకు తన టెస్ట్‌ కెరీర్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శన ఐదుసార్లు, 10 వికెట్ల ప్రదర్శన ఒకసారి ఉంది. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్  

సిరీస్‌ షెడ్యూల్‌..

  • ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్‌, నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌, ఢిల్లీ
  • మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, ధర్మశాల
  • మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌..

  • మార్చి 17న తొలి వన్డే, ముంబై
  • మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
  • మార్చి 22న మూడో వన్డే, చెన్నై
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top