అక్తర్‌ వన్డే జట్టులో ఆ ఇద్దరు కెప్టెన్లకు నో ప్లేస్‌..

No Place For Kohli And Babar Azam In Shoaib Akhtars All Time ODI XI - Sakshi

ఇస్లామాబాద్: ఇటీవలి కాలంలో దిగ్గజ ఆటగాళ్లు తమ తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసుకునే దిగ్గజాలు తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా.. తన ఆల్‌టైం ఫేవరెట్‌ వన్డే జ‌ట్టును ప్రకటించాడు. ఈ జట్టులో ఏకంగా నలుగురు భారత క్రికెటర్లకు(సచిన్‌, ధోనీ, యువరాజ్‌, కపిల్‌ దేవ్‌) స్థానం కల్పించిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. పరుగుల యంత్రాలుగా ప్రసిద్ధి చెందిన టీమిండియా, పాక్‌ కెప్టెన్లైన కోహ్లీ, బాబర్‌ ఆజమ్‌కు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అక్తర్ తన జట్టులో ఓపెనర్లుగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు గ్రీనిడ్జ్‌లను ఎంపిక చేశాడు. కీలక వన్ డౌన్‌లో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాన్ ఉల్ హక్‌కు అవకాశం ఇవ్వగా.. 4వ స్థానంలో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్‌ని ఎంచుకున్నాడు. 5వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని తీసుకున్నాడు. వికెట్ కీపర్‌ కోటాలో మాహీకి అవకాశం దక్కినా.. సారథిగా మాత్రం అక్తర్ అతడిని ఎంచుకోలేదు. 6వ స్థానంలో ఆసీస్ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, 7వ స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌లకు స్థానం కల్పించాడు.

8వ స్థానంలో పాక్‌ లెజెండరీ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్‌ను ఎంచుకున్న అక్తర్.. 9వ స్థానంలో వకార్ యూనిస్, 10వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌‌లకు అవకాశం ఇచ్చాడు. 11వ స్థానంలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌ను ఎంచుకున్న అతను.. కెప్టెన్‌గా కూడా అతనికే అవకాశం ఇచ్చాడు. అయితే ఈ జట్టులోని ఆటగాళ్ల కూర్పులో అక్తర్‌ వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. వారు రెగ్యులర్‌గా ఆడిన స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో అవకాశం కల్పించి అందరిని ఆశ్చర్యపరిచాడు. మరోవైపు ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లకు చెందిన ఒక్కరిని కూడా అక్తర్‌ తన జట్టులోకి తీసుకోకపోవడం విశేషం.

అక్తర్‌ డ్రీమ్‌ టీమ్‌: గార్డన్ గ్రీనిడ్జ్, సచిన్​ టెండూల్కర్​, ఇంజమామ్​-ఉల్​-హక్​, సయీద్​ అన్వర్​, ఎంఎస్​ ధోనీ (కీపర్), ఆడమ్​ గిల్​క్రిస్ట్​, యువరాజ్​ సింగ్​, వసీమ్ అక్రమ్​, వకార్​ యూనిస్​, కపిల్​ దేవ్​, షేన్​ వార్న్​ (కెప్టెన్​)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top