నిశేష్‌ జోరుకు మోన్‌ఫిల్స్‌ బ్రేక్‌ | Nisesh loses in mens singles semifinals | Sakshi
Sakshi News home page

నిశేష్‌ జోరుకు మోన్‌ఫిల్స్‌ బ్రేక్‌

Published Sat, Jan 11 2025 4:07 AM | Last Updated on Sat, Jan 11 2025 4:07 AM

Nisesh loses in mens singles semifinals

ఆక్లాండ్‌: ఏఎస్‌బీ క్లాసిక్‌ ఆక్లాండ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్‌ టీనేజర్‌ నిశేష్‌ బసవరెడ్డి విజయ పరంపరకు బ్రేక్‌ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 133వ ర్యాంకర్‌ నిశేష్‌ 6–7 (5/7), 4–6తో ప్రపంచ 52వ ర్యాంకర్, ఫ్రాన్స్‌ సీనియర్‌ స్టార్‌ ప్లేయర్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ చేతిలో ఓడిపోయాడు. మోన్‌ఫిల్స్‌తో 1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల నిశేష్‌ మూడు ఏస్‌లు సంధించాడు. 

తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో మోన్‌ఫిల్స్‌ పైచేయి సాధించాడు. రెండో సెట్‌ కూడా హోరాహోరీగా సాగింది. స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు తొమ్మిదో గేమ్‌లో నిశేష్‌ సర్వీస్‌ను మోన్‌ఫిల్స్‌ బ్రేక్‌ చేసి 5–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న మోన్‌ఫిల్స్‌ విజయాన్ని ఖరారు చేసుకొని కెరీర్‌లో 35వసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు.

సెమీస్‌లో ఓడిన నిశేష్‌కు 35,480 డాలర్ల (రూ. 30 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నిశేష్‌ 27 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ 106వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఈనెల 12న మొదలయ్యే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తొలి రౌండ్‌లో పదిసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌తో నిశేష్‌ తలపడతాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement