న్యూజిలాండ్- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మరి గెలుపు ఎవరిని వరించిందంటే..?!
ఐదు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు విండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆక్లాండ్‌లో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ వెస్టిండీస్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం అదే వేదికపై రెండో టీ20 జరిగింది. ఆక్లాండ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (16), వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (11) మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (25 బంతుల్లో 39) రాణించాడు.
కేవలం 28 బంతుల్లోనే
ఇక నాలుగో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 78 పరుగులు సాధించాడు. చాప్‌మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Starring Mark Chapman: A Bowler’s Nightmare 🎥#NZvWI pic.twitter.com/KXWomWevnN
— FanCode (@FanCode) November 6, 2025
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.
ఓపెనర్ బ్రాండన్ కింగ్ (0)ను జేకబ్ డఫీ డకౌట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అలిక్ అథనాజ్ (25 బంతుల్లో 33), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (26 బంతుల్లో 24) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్‌లో అకీమ్ ఆగస్టి (7), జేసన్ హోల్డర్ (16) నిరాశపరచగా.. ఏడో నంబర్ ఆటగాడు రోస్టన్ చేజ్ (6) కూడా విఫలమయ్యాడు.
రోవ్‌మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్
ఈ క్రమంలో విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ.. విండీస్ పవర్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్, ఆరు సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేశాడు.
అతడికి తోడుగా రొమారియో షెఫర్డ్ (16 బంతుల్లో 34), మాథ్యూ ఫోర్డ్ (13 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో కివీస్ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆఖరి ఓవర్లో విండీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది.
ఆఖరి ఓవర్లో కైలీ జెమీషన్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే ఫోర్డ్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత పరుగులేమీ రాలేదు. మూడో బంతి నోబాల్ కాగా ఫోర్డ్ మరో ఫోర్‌తో చెలరేగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో పావెల్ నాలుగో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ
దీంతో విండీస్ కీలక వికెట్ కోల్పోగా.. అకీల్ హొసేన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతికి అకీల్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి విండీస్ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఇక్కడే జెమీషన్ మాయ చేశాడు. అద్భుత బంతిని సంధించగా.. ఫోర్డ్ సింగిల్‌కే పరిమితమయ్యాడు.
దీంతో మూడు పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించిన ఆతిథ్య కివీస్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి, సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డఫీ, జెమీషన్ చెరో వికెట్ తీశారు. చాప్‌మన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టీ20కి సాక్స్‌టన్ ఓవల్ వేదిక.


