Nikhat Zareen: జగజ్జేత జరీన్‌

Nikhat Zareen Won Gold Medel Womens World Boxing Championship 2022 - Sakshi

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత బాక్సర్‌ నిఖత్‌  

న్యూఢిల్లీ: తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. 52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీలో జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో నిఖత్‌ ‘పంచ్‌’కు ఎదురే లేకుండా పోయింది. గురువారం థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌తో జరిగిన టైటిల్‌ పోరులో తెలంగాణ తేజం జరీన్‌ 5–0తో జయభేరి మోగించిది. తనపై భారతావని పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా ‘పసిడి’పతకం తెచ్చింది. ఒక్క ఫైనల్లోనే కాదు... ప్రతీ బౌట్‌లోనూ నిఖత్‌ పట్టుదలగా ఆడింది.

తనకెదురైన ప్రత్యర్థులపై కచ్చితమైన పంచ్‌లు విసురుతూ పాయింట్లను సాధించింది. ఫైనల్లోనూ ఆమె పంచ్‌లకే జడ్జీలంతా జై కొట్టారు. మూడు రౌండ్లపాటు జరిగిన ఈ బౌట్‌లో జరీన్‌ ఆధిపత్యమే కొనసాగింది. దీంతో జడ్జీలు 30–27, 29–28, 29–28, 30–27, 29–28లతో తెలంగాణ అమ్మాయికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చారు. భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ రికార్డులకెక్కింది. మేరీకోమ్‌ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్‌ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top