
షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం కైవసం
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సురుచి స్వర్ణ పతకం సాధించగా... శనివారం భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆర్య బోర్సే–అర్జున్ బబూతా జంట అద్వితీయమైన గురితో ఒలింపిక్ చాంపియన్ జిఫీ వాంగ్–లిహావో షెంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది. ఫైనల్లో ఆర్య–అర్జున్ జోడీ 17–7తో చైనా జంటను చిత్తుచేసి అగ్ర స్థానంలో నిలిచింది.
నార్వే జంటకు కాంస్య పతకం దక్కింది. భారత్‌కే చెందిన ఎలవెనిల్ వలరివన్–అంకుశ్ జాధవ్ జోడీ 631.8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో అర్జున్ 317.7 పాయింట్లు సాధించగా... ఆర్య 317.5 పాయింట్లు స్కోరు చేసింది. దీంతో ఓవరాల్‌గా 635.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీ రుద్రాం„Š పాటిల్‌తో కలిసి ఆర్య బోర్సే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రజత పతకం గెలిచింది.
తాజా ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం కాగా... ఓవరాల్‌గా నాలుగో పతకం. సిఫ్ట్ కౌర్ సమ్రా, ఎలవెనిల్ వలరివన్ వ్యక్తిగత కాంస్యాలు గెలుచుకున్నారు. ఇక పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనూ భాకర్–ఆదిత్య మల్రా 577 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సురుచి సింగ్–వరుణ్ తోమర్ జంట 576 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమైంది.