
పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో లియోన్ మర్చండ్ ఘనత
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఫ్రాన్స్ స్టార్ స్విమ్మర్ లియోన్ మర్చండ్ పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. బుధవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ సెమీఫైనల్ ఈవెంట్‌ను 23 ఏళ్ల మర్చండ్ 1 నిమిషం 52.61 సెకన్లలో ముగించాడు. ఈ క్రమంలో 14 ఏళ్లుగా అమెరికా మేటి స్విమ్మర్ ర్యాన్ లోచ్టె (1ని:54 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మర్చండ్ బద్దలు కొట్టాడు.
సెమీఫైనల్లో తొలుత 50 మీటర్లను (బటర్‌ఫ్లయ్ స్టయిల్) 24.10 సెకన్లలో పూర్తి చేసిన మర్చండ్... తదుపరి 50 మీటర్లను (బ్యాక్‌స్ట్రోక్ స్టయిల్) 28.40 సెకన్లలో ముగించాడు. తర్వాత 50 మీటర్లను (బ్రెస్ట్‌స్ట్రోక్ స్టయిల్) 32.13 సెకన్లలో... చివరి 50 మీటర్లను (ఫ్రీస్టయిల్) 28.06 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈరోజు జరిగే ఫైనల్లో మర్చండ్ తన పేరిట నమోదైన కొత్త ప్రపంచ రికార్డును మళ్లీ సవరించే అవకాశాలు ఉన్నాయి.
కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన లియోన్ మర్చండ్‌కు 30 వేల డాలర్లు (రూ. 26 లక్షల 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత ఏడాది స్వదేశంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మర్చండ్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి ఐదు పతకాలు సాధించి అదరగొట్టాడు. గత రెండు ప్రపంచ చాంపియన్íÙప్‌లలో (2022, 2023) మర్చండ్ 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో స్వర్ణ పతకాలు సాధించాడు.