నీరజ్‌ 90.23 మీటర్లు | Neeraj Chopra Scipts History Breaches 90m Mark With Throw | Sakshi
Sakshi News home page

నీరజ్‌ 90.23 మీటర్లు

May 16 2025 11:29 PM | Updated on May 17 2025 3:55 AM

Neeraj Chopra Scipts History Breaches 90m Mark With Throw

కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మైలురాయి దాటిన భారత స్టార్‌

దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో రెండో స్థానం ఖరారు

దోహా: 90 మీటర్లు... ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? అని కొన్నేళ్లుగా అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా శుక్రవారం సమాధానం ఇచ్చాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు భారత స్టార్‌ తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం ఖతర్‌ రాజధాని దోహాలో జరిగిన డైమండ్‌ లీగ్‌ మీట్‌లో నీరజ్‌ చోప్రా తన కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనను నమోదు చేశాడు.

27 ఏళ్ల నీరజ్‌ తన మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో నీరజ్‌ తన పేరిటే ఉన్న (2022 స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ మీట్‌లో 89.94 మీటర్లు) జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. విఖ్యాత కోచ్‌ జాన్‌ జెలెజ్నీ వద్ద శిక్షణ ప్రారంభించాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే నీరజ్‌ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. 11 మంది మేటి జావెలిన్‌ త్రోయర్లు పోటీపడ్డ దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో జూలియన్‌ వెబెర్‌ (జర్మనీ; 91.06 మీటర్లు) అగ్రస్థానాన్ని క్కించుకున్నాడు. నీరజ్‌ చోప్రా (90.23 మీటర్లు) రెండో స్థానం సంపాదించగా... 

అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 86.64 మీటర్లు) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కే చెందిన కిశోర్‌ కుమార్‌ జేనా (78.60 మీటర్లు) ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డైమండ్‌ లీగ్‌ మీట్‌లలో అథ్లెట్లకు పతకాలు బదులుగా పాయింట్లు కేటాయిస్తారు. టాప్‌–8లో నిలిచిన వారికి వరుసగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 పాయింట్లు లభిస్తాయి. వెబెర్‌కు 8 పాయింట్లు, నీరజ్‌కు 7 పాయింట్లు, పీటర్స్‌కు 6 పాయింట్లు దక్కాయి.

నిర్ణిత నాలుగు మీట్‌లు ముగిశాక టాప్‌–7లో నిలిచిన వారు ఫైనల్‌ మీట్‌లో పోటీపడతారు. సీజన్‌ తొలి మీట్‌లో నీరజ్‌ తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 88.44 మీటర్ల దూరం విసిరి శుభారంభం చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అతను ఫౌల్‌ చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్‌ జావెలిన్‌ 90.23 మీటర్లకు వెళ్లింది. నాలుగో ప్రయత్నంలో నీరజ్‌ జావెలిన్‌ను 80.56 మీటర్ల దూరం విసరగా... ఐదో ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో నీరజ్‌ జావెలిన్‌ను 88.20 మీటర్లు విసిరాడు.  

3 ఆసియా నుంచి జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరిన మూడో ప్లేయర్‌గా నీరజ్‌ చోప్రా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అర్షద్‌ నదీమ్‌ (పాకిస్తాన్‌; 92.97 మీటర్లు), చావో సున్‌ చెంగ్‌ (చైనీస్‌ తైపీ; 91.36 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్‌గా 25 మంది క్రీడాకారులు జావెలిన్‌ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement