
అప్పట్లో గాయంతో కష్టాలు
ఊర్లో అప్పులు–తిప్పలు
ఇప్పుడు... మా పల్లె వెలుగులోకి వచ్చింది
భారత జావెలియన్ త్రోయర్ సచిన్ యాదవ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత కొత్త జావెలియన్ త్రో సంచలనం సచిన్ యాదవ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకున్నాడు. పాల్గొన్న తొలి ప్రపంచ ఈవెంట్‌లోనే తన ప్రదర్శనతో దిగ్గజాలు నీరజ్ చోప్రా, జూలియన్ వెబర్‌లను అధిగమించడం మంచి అనుభూతినిషినప్పటికీ కాంస్యం చేజారడం తీవ్ర నిరుత్సాహపరిచిందని అన్నాడు. గురువారం జరిగిన పోటీల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల సచిన్ ఈటెను 86.27 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు.
కాంస్య విజేత కుర్టిస్ థామ్సన్ (అమెరికా; 86.67 మీటర్లు)కు కేవలం 40 సెంటిమీటర్ల దూరంతో పతకం అవకాశాన్ని కోల్పోయాడు. అయితే 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న సచిన్... రెండు ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా (84.03 మీటర్లు), ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 82.75 మీటర్లు), టోక్యో డైమండ్ లీగ్ చాంప్ వెబెర్ (జర్మనీ; 86.11 మీటర్లు)లాంటి హేమాహేమీలను అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా పలు అంశాలపై సచిన్ వెలుబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే...
ఘనంగానే ఆరంభించా
ప్రారంభ త్రో బాగా మురిపించింది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాయి. నా శరీర స్పందన, ఆటతీరు కూడా ఉత్సాహపరిచింది. తొలి త్రో వెళ్లిన దూరం, నేల తాకిన చోటు చూశాక పతకం గెలుస్తాననే ధీమా వచ్చింది. మిగతా ప్రయత్నాల్లో ఒక్కసారి అయిన 87 మీటర్ల దూరం ఈటెను విసురుతాననే నమ్మకం కలిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లతో పోటీపడుతున్న నాకు సహజంగానే తదుపరి ప్రదర్శన మించి ఉంటుందనే భావించాను. నా శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మిగతా ఐదు ప్రయత్నాల్లో ఆరంభ త్రోను మెరుగుపర్చుకోకపోవడం వల్లే ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం కోల్పోయాను.
నీరజ్ 2 పతకాలు ఖాయమన్నాడు
సీనియర్ సహచరుడు, స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాను. ఫైనల్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనూ మేమిద్దరం ముచ్చటించుకున్నాం. నా తొలి త్రో చూసిన వెంటనే చోప్రా నాతో ఈ ఈవెంట్‌లో దేశానికి రెండు పతకాలు ఖాయమయ్యాయన్నాడు. అతను వెన్నెముక సమస్యతో బాధపడుతున్నప్పటికీ మంచి ప్రదర్శన ఇస్తాడనే అనుకున్నాను. కానీ నీరజ్... ప్రదర్శనలో నా కంటే వెనుకబడిపోవడం చాలా బాధనిపించింది. టోక్యో ఒలింపిక్స్ నుంచి పోడియంలో ఉంటున్న అతను చివరకు ఇక్కడ పతకానికి దూరమవడం నా బాధను రెట్టింపు చేసింది.
ఆటలు, అథ్లెట్లు ఎరుగరు
నా ప్రదర్శనతో మా గ్రామంలో (భాగ్‌పట్ జిల్లాలోని ఖేరా) ఎక్కడలేని హడావుడి మొదలైంది. కొందరు జర్నలిస్టులు మా తల్లిదండ్రులతో మాట్లాడారంట. ఆటలు, అథ్లెట్లు, పతకాలంటే వాళ్లకి అస్సలు తెలినే తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా తమ కుమారుడికి మంచి ఉద్యోగం, చక్కని జీవితం లభిస్తే చాలనుకునే అమాయకులు. ముఖ్యంగా నన్ను ఓ ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నారు. 2023లో ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగం దొరకడంతోనే వారి ఆనందానికి హద్దుల్లేవు. అలాంటిది ఇప్పుడు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు వచ్చి తమని ప్రముఖంగా ఫొటోలు తీసారని నా తల్లి గొప్పగా చెప్పింది.
నా గాయంతో అప్పులపాలయ్యాం
నిజం చెప్పాలంటే నాకు అసలు నాణ్యమైన కోచ్ లేడు. మరో జావెలిన్ త్రోయర్ సందీప్ యాదవ్ నా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. అతనే గతేడాది నాకు పారాలింపిక్ స్వర్ణ విజేతలు సుమిత్, నవ్‌దీప్‌ల కోచ్ నవల్ సింగ్‌కు పరిచయం చేశాడు. ఇక కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2021లో నా భుజానికి అయిన గాయంతో మా నాన్న చాలా ఖర్చు చేశాడు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ల దగ్గర అప్పులు చేసి నన్ను బాగు చేశాడు.
మళ్లీ ఈ ఏడాది ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పుడు కూడా చీలమండ గాయంతో ఇబ్బందిపడ్డాను. అయితే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారింది. ఇప్పుడు నేను ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో ఉన్నాను. వ్యక్తిగత స్పాన్సర్‌షిప్ కూడా లభించింది. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. పునరావాస శిబిరంలోనే గాయానికి చికిత్స తీసుకుని వెంటనే మెరుగయ్యాను.
సచిన్‌కు చీఫ్ కోచ్ కితాబు
క్రీడాశాఖ ప్రోత్సాహకాలతో సచిన్ యాదవ్‌కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో దిగ్గజ రష్యన్ కోచ్ సెర్గెయ్ మకరొవ్ శిక్షణ జతయ్యింది. సచిన్ టాలెంట్‌ను గుర్తించిన ఆయన వెంటనే చిన్నచిన్న తప్పు ఒప్పులను సరిచేశారు. మెలకువలు నేరి్పంచారు. ట్రెయినింగ్ సెషన్స్‌లో 90 మీటర్ల దూరం కూడా ఈటెను విసిరాడని, అతను భారత జావెలిన్ త్రోలో నీరజ్‌కు ధీటుగా పతకాలు సాధిస్తాడని చీఫ్ కోచ్ మకరొవ్ కితాబిచ్చారు.
ఇలా ముగిస్తానని అనుకోలేదు: నీరజ్
న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... విరామం అనంతరం బలంగా తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. టోక్యో వేదికగా జరిగిన ఫైనల్లో జావెలిన్‌ను 84.03 మీటర్ల దూరం విసిరిన డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా... ఐదో త్రో అనంతరం ఎలిమినేట్ అయ్యాడు. ఇదే పోటీలో భారత్‌కు చెందిన మరో త్రోయర్ సచిన్ యాదవ్ జావెలిన్‌ను 86.27 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు.
సచిన్‌కు ఇదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ‘సీజన్‌ను ఇలా ముగిస్తానని అనుకోలేదు. దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతోనే టోక్యో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టా. కానీ అది సాధ్యపడలేదు. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మరింత బలంగా తిరిగివస్తా.
సచిన్ యాదవ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం ఆనందంగా ఉంది. అతడు త్రుటిలో పతకం కోల్పోయాడు’ అని నీరజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా పతక విజేతలకు నీరజ్ అభినందనలు తెలిపాడు. 27 ఏళ్ల నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం... 2022 ప్రపంచ చాంపియన్ షిప్‌లో రజతం... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించాడు.