
అర్షద్ నదీమ్‌తో స్నేహంపై నీరజ్ చోప్రా వివరణ
భవిష్యత్‌లో ఎలా ఉండబోతుందో చెప్పలేనన్న భారత స్టార్
నేడు దోహా డైమండ్ లీగ్ బరిలో నీరజ్
దోహా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన పాక్ ప్రత్యర్థి అర్షద్ నదీమ్‌తో గల అనుబంధంపై స్పష్టత ఇచ్చాడు. దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన అతను పతకంపై గురి పెట్టాడు. విమర్శలపై సమాధానమిచ్చాడు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధవాతావరణాన్ని సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాకిస్తాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్‌కు భారత్‌లో జరిగే ఈవెంట్ కోసం ఆహ్వానం పలకడంపై నీరజ్ చోప్రా సహా అతని కుటుంబసభ్యులపై కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.
వీటిని తాళలేక చోప్రా వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి బెంగళూరులో వచ్చే వారం నిర్వహించతలపెట్టిన ‘ఎన్‌సీ క్లాసిక్’ ఈవెంట్ నిరవధిక వాయిదా పడింది. అయితే తమ ఇద్దరి బంధంపై తాజాగా నీరజ్ స్పష్టత ఇచ్చాడు. ‘ముందుగా మీకో విషయం స్పష్టం చేయదల్చుకుంటున్నా... అర్షద్‌తో నాకున్నది పోటీల సందర్భంగా ఉండే స్నేహమే! అంతేతప్ప బలమైన అనుబంధం, ప్రాణ స్నేహితులం ఏమాత్రం కాదు.
అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితులతో కనీసం ముందరిలా ఉంటామో లేదో కూడా తెలీదు. ఒకవేళ అతను సంస్కారం చూపితే నేను చూపుతా. అంతకుమించి ఇంకేమీ ఉండదు. మైదానంలో అథ్లెట్లుగా మాట్లాడుకుంటాం. అథ్లెట్ మిత్రులుగానే మెలుగుతాం. అంతే!’ అని అన్నాడు.
మొదట్లో కష్టమనిపించినా...
ప్రస్తుత కోచ్, లెజెండ్ జాన్ జెలెజ్నితో మొదట్లో శిక్షణ చాలా కష్టమనిపించిందని, కఠినంగా ఉండేదని అయితే ఇప్పుడా సమస్య లేదని నీరజ్ వివరించాడు. ‘నా పాత కోచ్ క్లాస్ బార్టొనీట్జ్ శైలి వేరు. ప్రస్తుత కోచ్ జెలెజ్నీ శైలి పూర్తి భిన్నం. అతనితో కలిసి పని (శిక్షణ) చేయడానికి ఇబ్బంది పడ్డాను.
చాలా విభిన్నమైన శిక్షణ శైలి అతనిది. తర్వాతర్వాత అలవాటు పడ్డాక అంతా సర్దుకుంది. జెలెజ్నీ కోచింగ్‌లో ఎంతటి నిష్ణాతుడో అందరికీ తెలుసు. నా టెక్నిక్, రనప్ ఇపుడంతా మెరుగైంది. అలాగని పాత కోచ్ క్లాస్ తక్కువేమీ కాదు. నాలుగైదేళ్లు అతని శిక్షణలోనే రాటుదేలాను’ చోప్రా అన్నాడు.
టైటిల్ లక్ష్యంతో చోప్రా...
దోహా డైమండ్ లీగ్ మాజీ చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. ఇలాంటి అనుకూలతలతో ఈ లీగ్‌లో స్వర్ణం చేజిక్కించుకోవడం అతనికి ఏమంత కష్టం కానేకాదు. శుక్రవారం జరిగే జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్‌కు రెండు సార్లు ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది.
అతనితో పాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్), జర్మనీకి చెందిన జులియన్ వెబెర్, మ్యాక్స్ డెహ్నింగ్, జూలియుస్ యెగో (కెన్యా), రొడెరిక్ గెన్కీ డీన్ (జపాన్)లు నీరజ్ చోప్రాకు పోటీ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ పోటీల్లో తలపడే ప్రత్యర్థులందరూ ఈ డైమండ్ లీగ్ బరిలో ఉన్నారు. అయితే పాక్ చాంపియన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ మాత్రం గైర్హాజరయ్యాడు. లీగ్ కోసం ఎంతో కసరత్తు చేశానని పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని చోప్రా చెప్పాడు.
స్టీపుల్‌చేజ్‌లో గుల్‌వీర్, పారుల్
నీరజ్ జావెలిన్ త్రోలో పతకంపై గురిపెట్టగా, మిగతా భారత అథ్లెట్లు గుల్‌వీర్ సింగ్, పారుల్ చౌధరీ స్టీపుల్‌చేజ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రికార్డు నెలకొల్పిన గుల్‌వీర్ పురుషుల 5000 మీటర్ల పోటీలో పొడియంలో నిలవాలని గంపెడాశలు పెట్టుకున్నాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌధరీ గట్టి పోటీ ఇచ్చేందుకు సై అంటోంది.