తిరుగులేని ముష్ఫికర్‌ రహీం.. తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర | Mushfiqur Rahim Scripts History Becomes 1st Bangladesh Batter To Reach | Sakshi
Sakshi News home page

తిరుగులేని ముష్ఫికర్‌ రహీం.. తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర

Nov 9 2026 3:59 PM | Updated on Nov 9 2026 4:11 PM

Mushfiqur Rahim Scripts History Becomes 1st Bangladesh Batter To Reach

PC: BCB X

బంగ్లాదేశ్‌ దిగ్గజ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం సరికొత్త చరిత్ర లిఖించాడు. బంగ్లా జట్టు తరఫున టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తూ సహచర ఆటగాళ్లకు అందనంత ఎత్తులో నిలిచాడు.

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సోమవారం నాటి ఐదో రోజు ఆట సందర్భంగా ముష్పికర్‌ రహీం ఈ ఘనత సాధించాడు. సెల్హైట్‌ వేదికగా గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆమిర్‌ జాంగో శతక్కొట్టగా (133).. తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌట్‌ అయింది.

హృదోయ్‌ అజేయ ద్విశతకం
ఇందుకు బంగ్లాదేశ్‌ ధీటుగానే బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసి.. 30 పరుగుల ఆధిక్యం సంపాదించింది. తౌహీద్‌ హృదోయ్‌ అజేయ ద్విశతకం (242 నాటౌట్‌) కారణంగా ఇది సాధ్యమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌.. 398 పరుగులకు ఆలౌట్‌ అయి.. ఆతిథ్య బంగ్లా జట్టుకు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే, ఐదో రోజు ఆటలో భాగంగా 59 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగుల వద్ద ఉండగా.. వెలుతురు లేమి వల్ల ఆటకు ఇబ్బంది తలెత్తింది. ఆట కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇరుజట్లు ‘డ్రా’కు అంగీకరించాయి.

49 పరుగులు
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేసిన ముష్ఫికర్‌ రహీం.. రెండో ఇన్నింగ్స్‌లో 123 బంతులు ఎదుర్కొని 49 పరుగులు సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా ముష్ఫికర్‌ నిలిచాడు. అతడి దరిదాపుల్లో కూడా ప్రస్తుతానికి మరో ఆటగాడు లేడు. ‍

ఇదిలా ఉంటే.. చూపుడు వేలికి గాయం కారణంగా విండీస్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు ముష్ఫికర్‌. తదుపరి సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యాడు.

టెస్టుల్లో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు
👉ముష్ఫికర్‌ రహీం- 7040 పరుగులు
👉మొమినుల్‌ హక్‌- 5393 పరుగులు
👉తమీమ్‌ ఇక్బాల్‌- 5134 పరుగులు
👉షకీబ్‌ అల్‌ హసన్‌- 4609 పరుగులు
👉లిటన్‌ దాస్‌- 3549 పరుగులు. 

ఇవీ చదవండి: IND vs NZ ODIs: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ!
ఫ్లాట్‌ వికెట్లకు అలవాటుపడ్డారు.. వీళ్లేం బౌలింగ్‌ చేస్తారనుకున్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement