అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్‌

Mongolia Bowled Out For 15 In Asian Games 2023 Against Indonesia - Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఏషియన్‌ గేమ్స్‌ వుమెన్స్‌ క్రికెట్‌లో మంగోలియా జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 19) జరిగిన మ్యాచ్‌లో మంగోలియన్లు ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా రికార్డైంది. ఇదే ఏడాది స్పెయిన్‌తో జరిగిన పురుషుల టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లో ఐసిల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌటై, అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.

ఇండోనేషియా-మంగోలియా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల  నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్‌ రత్న దేవీ అర్ధసెంచరీతో (48 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించగా.. మరో ఓపెనర్‌ నందా సకరిని (35), మరియా వొంబాకీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మంగోలియా బౌలర్లలో మెండ్‌బయార్‌, నముంజుల్‌, జర్గల్సై ఖాన్‌, గన్‌సుఖ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. ఆరియాని (3-0-8-4), రహ్మావతి (3-2-1-2), రత్న దేవీ (2-0-4-2) ధాటికి 10 ఓవర్లలో 15 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడుగురు డకౌట్లు కాగా.. ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో, ఓపెనర్‌ బత్‌జర్గల్‌  చేసిన 5 పరుగులే మంగోలియన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్స్‌గా నిలిచాయి.

కాగా, ఆసియా క్రీడల్లో మొట్టమొదటిసారిగా క్రికెట్‌ ఈవెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలతో పాటు పురుషుల విభాగంలోనూ ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్‌ కూడా పాల్గొంటుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top