మరిన్ని టెస్టులు... మరింత మెరుగు... | Indian Womens Cricketer Pratika Rawal Opinion on tests | Sakshi
Sakshi News home page

మరిన్ని టెస్టులు... మరింత మెరుగు...

Mar 18 2026 3:53 AM | Updated on Mar 18 2026 3:54 AM

Indian Womens Cricketer Pratika Rawal Opinion on tests

ప్రపంచకప్‌ విజయం చిరస్మరణీయం

భారత మహిళా క్రికెటర్‌ ప్రతీక రావల్‌ అభిప్రాయం

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌లోనూ క్రమం తప్పకుండా టెస్టు మ్యాచ్‌లు జరిగితేనే జట్టు మెరుగవుతుందని భారత బ్యాటర్‌ ప్రతీక రావల్‌ చెప్పింది. ఇటీవల ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన ఏకైక డే అండ్‌ నైట్‌ పింక్‌ బాల్‌ టెస్టులో ఆమె అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సంప్రదాయ టెస్టు క్రికెట్‌నే అందమైన ఫార్మాట్‌గా అభివరి్ణంచింది. పరిపూర్ణ క్రికెటర్‌ అయ్యేందుకు పరీక్ష పెడుతుందని చెప్పుకొచ్చింది. 

పురుషుల విభాగంతో పోలిస్తే మహిళల క్రికెట్‌లో టెస్టు మ్యాచ్‌లు అరుదుగా జరుగుతున్నాయి. 1976లో తొలి టెస్టు ఆడిన భారత మహిళల జట్టు 2026 వరకు మొత్తం 42 టెస్టుల్లో మాత్రమే పోటీపడింది. ఇందులో 8 టెస్టుల్లో గెలిచి, 7 టెస్టుల్లో ఓడిపోయింది. 27 టెస్టులను ‘డ్రా’గా ముగించింది. న్యూఢిల్లీలో జాతీయ క్రీడా పాత్రికేయుల సమాఖ్య కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న 25 ఏళ్ల ప్రతీక ఈ సందర్భంగా చెప్పిన కబుర్లు ఆమె మాటల్లోనే... 

జగజ్జేతలుగా నిలవడం 
వన్డే ప్రపంచకప్‌ విజేతగా నిలవడం అన్నింటికంటే మించిన అద్భుతమైన అనుభవం. నా కెరీర్‌లో అదెప్పటికీ చిరస్మరణీయంగానే ఉంటుంది. ఇన్ని రోజులైనా... ఆ విజయం, కప్‌ ఎత్తుకున్న మా బృందం చేసిన సందడి, సంబరం కళ్లముందు కదలాడుతూనే ఉంది. బహుశా ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందేమో చెప్పలేను. ఎందుకంటే మేం గెలిచింది... ఎప్పుడూ తలచుకునే ప్రపంచకప్‌ను. 

అసలైన క్రికెట్‌ అదే 
క్రికెట్‌లో టెస్టే అసలైన ఫార్మాట్‌. చిన్నప్పుడు మా నాన్న, కోచ్‌ ఇదే విషయాన్ని చెప్పారు. ఈ సంప్రదాయ ఫార్మాటే ప్రధానమైందని, ఇందులో రాణిస్తేనే క్రికెట్‌లో రాటుదేలుతామని, తద్వారా ఆ ఫార్మాట్‌ మన అభిమాన ఆటగా మారుతుందన్నారు. ఇప్పుడు టెస్టు ఆడుతుంటే నాక్కూడా అదే అనుభవం కలిగింది. 

సచిన్, లారా వీడియోల్ని చూసి 
పరిమిత ఓవర్ల క్రికెట్‌ పూర్తి భిన్నమైంది టెస్టు ఫార్మాట్‌. అందుకే ఈ సంప్రదాయ ఆటను ఒంటబట్టించుకునేందుకు దిగ్గజాలు ఆడిన తీరును అదేపనిగా చూశాను. టెస్టుల్లో సచిన్‌ టెండూల్కర్, రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా), వివియన్‌ రిచర్డ్స్, బ్రియాన్‌ లారా (వెస్టిండీస్‌)లు ఎలా ఆడారో తదేకంగా చూసేదాన్ని. గంటల తరబడి క్రీజులో నిలబడిన వారి బ్యాటింగ్‌ నాకు ప్రేరణగా ఉపయోగపడింది. నా ఆటకు ఉ్రత్పేరకంగా పనిచేసింది. 

ఈ ఏడాది కీలకం 
అమ్మాయిల జట్టుకు ఈ సీజన్‌ అత్యంత కీలకం. ఈ ఏడాది మహిళల టి20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా క్రీడలు కూడా జరుగనున్నాయి. ఏషియాడ్‌లో కూడా టి20 ఫార్మాట్‌లోనే క్రికెట్‌ పోరు జరుగుతుంది. అందుకే ప్రస్తుతం జట్టు కోసం శ్రమించేందుకు, జట్టు విజయాల్లో భాగం కావాడమే లక్ష్యంగా నేను కసరత్తు చేస్తున్నాను. అంతేతప్ప భవిష్యత్తుపై అదేపనిగా అతిగా ఆలోచించను. 

గుర్తింపే కదా ఎవరైనా ఆశించేది 
బీసీసీఐ వార్షిక నమన్‌ అవార్డుల్లో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇదే తొలి వేడుక (బోర్డుకు సంబంధించి). ఎక్కడైనా... ఎవరైనా కోరుకునేది గుర్తింపునే. మన శ్రమను గుర్తించి ఇచ్చే అవార్డులు మనల్ని మరింత కష్టపడేందుకు దోహదపడతాయి. మనదేశంలో కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌ కూడా పురుషుల క్రికెట్‌లా దూసుకెళుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement