
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లకు ఒమన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ హరిస్ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగల్గింది. తొలి ఓవర్‌లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ హరిస్(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికి బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్(16 బంతుల్లో 23) తన మార్క్ చూపించలేకపోయాడు.
కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్ నవాజ్(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు.