
రెడ్‌బుల్ డ్రైవర్ ఖాతాలో అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి టైటిల్
బాకు (అజర్‌బైజాన్): ఫార్ములావన్ తాజా సీజన్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌చేజిక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్... ఆదివారం అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది ఇది 17వ రేసు కాగా... అందులో వెర్‌స్టాపెన్‌కు నాలుగో విజయం. ఆదివారం జరిగిన ప్రధాన రేసును పోల్ పొజిషన్‌తోప్రారంభించిన వెర్‌స్టాపెన్ 51 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 33 నిమిషాల 26.408 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
రేసు ఆరంభం నుంచే వాయువేగంతో దూసుకెళ్లిన నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం ఆధిక్యంలో కొనసాగాడు. వెర్‌స్టాపెన్ వరుసగా రెండు రేసులు నెగ్గడం ఈ ఏడాది ఇదే తొలిసారి. మెర్సిడెస్‌కు చెందిన రసెల్ 1 గంట 33 నిమిషాల 41.017 సెకన్లలోలో పూర్తి చేసి రెండో స్థానం దక్కించుకున్నాడు. విలియమ్స్ రేసింగ్‌కు చెందిన కార్లోస్ సెయింజ్ 1 గంట 33 నిమిషాల 45.607 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న మెక్‌లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి కారు తొలి ల్యాప్‌లోనే ప్రమాదానికి గురవడంతో రేసును పూర్తి చేయలేకపోయాడు. ఏడు సార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 34 నిమిషాల 2.718 సెకన్లు; ఫెరారీ) ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘ప్రతికూల పరిస్థితుల్లో ఇలాంటి ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది. గాలి ప్రభావంతో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగా. ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా’ అని వెర్‌స్టాపెన్ పేర్కొన్నాడు.
24 రేసుల సీజన్‌లో 17 రేసులు ముగిసేసరికి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో పియాస్ట్రి 324 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నోరిస్ 299 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా విజయంతో వెర్‌స్టాపెన్ 255 పాయింట్లతో మూడో స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నాడు. తొలి స్థానంలో ఉన్న పియా్రస్టికి వెర్‌స్టాపెన్‌కు మధ్య 69 పాయింట్లు తేడా ఉంది. తదుపరి రేసు అక్టోబర్ 5న సింగపూర్ గ్రాండ్‌ప్రి జరుగనుంది.
67 ఫార్ములావన్ కెరీర్‌లో వెర్‌స్టాపెన్ సాధించిన విజయాలు. అత్యధిక విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నాడు. లూయిస్ హామిల్టన్ (బ్రిటన్; 105) తొలి స్థానంలో, మైకేల్ షుమాకర్ (జర్మనీ; 91) రెండో స్థానంలో ఉన్నారు. కెరీర్ మొత్తంలో 226 రేసుల్లో పోటీపడ్డ వెర్‌స్టాపెన్ ఇప్పటివరకు 120 సార్లు టాప్–3లో నిలిచాడు.
