
PC: Social Media
డిజిటల్ యుగంలో ఎవరు.. ఎప్పుడు.. ఎవరికి.. ఎందుకు టార్గెట్ అవుతారో తెలియదు. పనీపాటాలేని ‘కీ-బోర్డు’ యోధులు తమకు నచ్చని వారిపై విద్వేష విషం చిమ్మేందుకు సోషల్ మీడియా అనే ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడతారు. అలాంటి వారికి ఇప్పుడు ఓ పదేళ్ల పిల్లాడు లక్ష్యంగా మారాడు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)’ అనే షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేబీసీ 17 సీజన్‌లో ఇషిత్ భట్ (Ishit Bhatt) అనే ఐదో తరగతి చదివే పిల్లాడు హాజరయ్యాడు. గుజరాత్‌లోని గాంధీనగర్ అతడి స్వస్థలం.
నాకు నిబంధలన్నీ తెలుసు
ఇక షోలో భాగంగా ఇషిత్‌తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ ముచ్చటిస్తున్న సమయంలో.. ‘‘నాకు నిబంధలన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు వాటిపై నాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకండి. అరె బాబా నాకు ఆప్షన్స్ ఇవ్వండి. సర్.. ఈ జవాబును ఒకటి కాదు.. నాలుగుసార్లు లాక్ చేసుకోండి’’ అంటూ కాస్త అతిగా మాట్లాడుతూ.. అత్యుత్సాహం ప్రదర్శించాడు.
బుద్ధిలేని పిల్లాడు అంటూ ట్రోల్స్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇషిత్ భట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘‘బుద్ధిలేని పిల్లాడు.. తల్లిదండ్రులు అతడి కనీస గౌరవ మర్యాద ఇవ్వడం నేర్పలేదు. బిగ్ బీ వంటి మెగాస్టార్‌తోనే ఇలా మాట్లాడతాడా?’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
అదే సమయంలో అమితాబ్ బచ్చన్ ఈ పరిణామాన్ని చక్కగా హాండిల్ చేశారనే ప్రశంసలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇషిత్ భట్‌ను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పిరికిపందల్లారా!.. చిన్న పిల్లాడు.. వదిలేయండిరా!
‘‘ఏమాత్రం సెన్స్ లేకుండా.. పిరికిపందలంతా తమ నోరుపారేసుకోవడానికి సోషల్ మీడియా ఎలా వేదిక అవుతుందో తెలిపే మరొక ఉదాహరణ ఇది. అతడు చిన్నపిల్లాడు!!
తనని ఎదగనివ్వండి!!.. చిన్న పిల్లోడినే సహించలేని ఈ సమాజం.. ఎంతో మంది మూర్ఖులకు మాత్రం బ్రహ్మరథం పడుతుంది. ఈ పిల్లాడిని ట్రోల్ చేస్తున్నవారిని సహిస్తుంది’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వరుణ్ చక్రవర్తి ట్రోల్స్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.
కాగా సెలబ్రిటీలు ముఖ్యంగా క్రికెటర్లు కూడా సోషల్ మీడియాకు ఈజీ టార్గెట్ అన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఆడకపోతే గనుక వారిపై మీమ్స్ వేస్తూ.. ట్రోల్స్ చేసేవాళ్లకు కొదవలేదు. ఈ నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తి.. పిల్లాడి విషయంలోనూ ఇలా చేయడాన్ని సహించలేక నెటిజన్లకు ఇలా చురకలు అంటించాడు.
ఇదిలా ఉంటే.. ఇషిత్ భట్.. ‘వాల్మీకి రామాయణంలోని మొదటి కాండ ఏది?’ అనే ప్రశ్నకు అయోధ్య కాండ అనే తప్పుడు సమాధానం ఇచ్చి ఎలిమినేట్ అయ్యాడు. దీనికి సరైన జవాబు బాలకాండ.
ఫైనల్‌లో మ్యాజిక్
వరుణ్ చక్రవర్తి ఇటీవల ఆసియా టీ20 కప్-2025 టోర్నీలో పాల్గొన్నాడు. ఈ ఖండాంతర ఈవెంట్లో మొత్తంగా తొమ్మిది వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఫైనల్లో ఫఖర్ జమాన్ రూపంలో కీలక వికెట్ తీసి.. పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియా టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. తదుపరి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో వరుణ్ భాగం కానున్నాడు.
చదవండి: గిల్.. ఇప్పటికీ అవే వాడుతున్నాడు.. వాటిని అస్సలు మార్చడు: సూర్య