అంపైర్లు విస్కీ తాగామని చెప్పేవారు: టీమిండియా మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

Manoj Tiwary Said Dope Tests Should Be Extended To Domestic Umpires - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌, ఇటీవలే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి దేశవాలీ అంపైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్‌ అనంతరం జరిగిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆటగాళ్లు డోప్ పరీక్షలకు వెళ్లవలసి వస్తే, దానిని దేశీయ అంపైర్లకు కూడా విస్తరించాలి. నేను చాలాసార్లు అంపైర్లు నిద్రపోతున్నట్లు చూశాను.

అలా అంపైర్లను చూసిన సందర్భాల్లో.. సార్ నిన్న రాత్రి మీరు ఏమి తాగారని వారిని అడిగేవాడిని. అందుకు వాళ్లు నవ్వుతూ.. నేను విస్కీని ఇష్టపడతానంటూ సమాధానం ఇచ్చేవారు. అలా జరగకుండా దేశీయ అంపైర్లలో సీరియస్‌నెస్‌ రావాలంటే బీసీసీఐ తగిన చర్యలు తీసుకుని, వారికి కూడా డోప్‌ పరీక్షలు నిర్వహించాలని తివారి అన్నాడు.

ఈ వ్యాఖ్యలు చేయకముందు తివారి దేశవాలీ క్రికెట్‌పై, ముఖ్యంగా రంజీలపై, టీమిండియాలో తన కెరీర్‌ అర్దంతరంగా ముగియడంపై, ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాగా రాణిస్తున్నా టీమిండియాలో తనను తొక్కేశారంటూ ధోనిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత క్రికెటర్ల మాదిరి  తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలా ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని అన్నాడు.

కాగా, రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత తివారి తన 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 148 మ్యాచ్‌లు ఆడిన  తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్‌-ఏ క్రికెట్‌ లో 169 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 5581 రన్స్‌ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

183 టీ20ల్లో 3436 పరుగులు సాధించిన తివారి.. 2008-2015 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడి  287, 15 పరుగులు చేశాడు. వన్డేల్లో తివారి అత్యధిక స్కోరు 104 నాటౌట్‌గా ఉంది. 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top