Lionel Messi: మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు..

Magician Leaves Messi Mesmerized With His Card-Trick Video Viral - Sakshi

ఫుట్‌బాల్‌లో లియోనల్‌ మెస్సీది ప్రత్యేక స్థానం. మైదానంలో తన ఆటతో అభిమానులను మాయ చేయగల సత్తా అతని సొంతం. గతేడాది ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపించిన మెస్సీ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందిన మెస్సీ ఎట్టకేలకు తన ఫిఫా వరల్డ్‌కప్‌ కలను సాకారం చేసుకున్నాడు. అలాంటి మెస్సీనే తెలివిగా బోల్తా కొట్టించాడు మెజీషియన్‌. కార్డ్‌ ట్రిక్‌ ప్లేతో తన మ్యాజిక్‌ను చూపించి మెస్సీనే మెస్మరైజ్‌ చేశాడు.

విషయంలోకి వెళితే.. ప్రస్తుతం మెస్సీ పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌(పీఎస్‌జీ) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  గురువారం రాత్రి పీఎస్‌జీ ప్లేయర్స్‌కు పారిస్‌లో ఒక పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెస్సీ సహా ఇతర పీఎస్‌జీ ప్లేయర్లు హాజరయ్యారు. ఇదే పార్టీకి జూలిస్‌ డెయిన్‌ అనే మెజీషియన్‌ కూడా వచ్చాడు. మెస్సీ దగ్గరికి వచ్చి కార్డ్‌ ట్రిక్‌ ప్లే మ్యాజిక్‌ షో చూపిస్తానన్నాడు.

మెస్సీని ఒక కార్డు సెలెక్ట్‌ చేసుకోవాలని.. కానీ అది ఏ కార్డు అనేది తనకు చూపించొద్దన్నాడు. అలా మెస్సీ ఏస్‌(A) కార్డును సెలెక్ట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత తన మ్యాజిక్‌ ట్రిక్‌తో మెస్సీ ఏంచుకున్న కార్డును మెజీషియన్‌ కరెక్టుగా చూపించడంతో పాటు అర్థం కాని భాషలో మాట్లాడాడు. ఆ సమయంలో మెస్సీ భార్య ఆంటోనెల్లా కూడా అక్కడే ఉంది. ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో తెలియక మెజీషియన్‌ పడుతున్న కష్టాన్ని చూసి మెస్సీ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ అందించిన తర్వాత ఆటకు రిటైర్మెంట్‌ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరికొన్ని రోజులు తన ఆటను కొనసాగిస్తానని మెస్సీ మనసులో మాటను చెప్పాడు. కానీ గత రెండురోజులుగా మెస్సీ త్వరలోనే రిటైర్‌ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మెస్సీ కూడా అర్జెంటీనా జెర్సీని పట్టుకొని.. 'ఇక ముగిసింది' అన్నట్లుగా హింట్‌ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. 35 ఏళ్ల మెస్సీ.. లీగ్‌-1లో భాగంగా మోంట్‌పిల్లీర్‌తో మ్యాచ్‌లో గోల్‌ చేయగా.. 3-1తో పీఎస్‌జీ విజయం సాధించింది.

చదవండి: వాళ్లిద్దరు నిజంగా కలిశారా..?

గిల్‌పై ఇషాన్‌ కిషన్‌ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top